'విన్నర్' సినిమా అనసూయని వివాదంలోకి లాగింది. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. ట్రైలర్ కూడా రాలేదు.. అప్పుడే ఈ వివాదమేంటి.? అనుకుంటున్నారా.? అదే మరి వెరైటీ. 'విన్నర్' సినిమాకి సంబంధించి ఇప్పటిదాకా మూడు ఆడియో సింగిల్స్ వచ్చేశాయి. అందులో ఒకటి అనసూయ చేసిన ఐటమ్ సాంగ్. ఈ సాంగ్‌ని బుద్ధుడి విగ్రహం ముందు చిత్రీకరించారు. అదే వివాదానికి కారణం.
బుద్ధుడి ముందు ఐటమ్ సాంగేంటి.? అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేసేస్తోంటే, అనసూయకి ఒళ్ళు మండిపోయింది. 'ఆ బార్‌లో బుద్దుడి విగ్రహం ముందే మందు కొడతారు.. మేం జస్ట్ ఐటమ్ సాంగ్ చేశామంతే..' అంటూ సమాధానమిచ్చింది. అవునా.? అది నిజమా.? నిజమో కాదోగానీ, 'రచ్చ' సినిమా కూడా ఇలాగే బుద్ధుడి కారణంగా వివాదాల్లోకెక్కింది.
'వానా వానా వెల్లువాయె..' సాంగ్ బ్యాక్‌డ్రాప్‌లో బుద్ధుడి విగ్రహం కన్పిస్తుంది. అదే వివాదాస్పదమయ్యింది. జనాల మనోభావాలు దెబ్బతిన్నాయి. చేసేది లేక, బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడ్ని బ్లర్ చేసేశారు. మరి, 'విన్నర్' సినిమా విషయంలో ఏమవుతుందో ఏమో.! అనసూయా.. అక్కడ మనోభావాల్లేవేమో.. ఇక్కడుంటాయ్.. అదే తేడా.