సర్జికల్‌ స్ట్రైక్స్‌.. నిప్పులాంటి నిజం

నిజం నిప్పులాంటిది.. దానికి పబ్లిసిటీ అవసరం లేదు. ఆ నిజం చుట్టూ ఎన్ని అనుమానాలైనా వుండొచ్చుగాక. కానీ, నిజం నిప్పులాంటిదే. కనిపించే నిజాన్ని సైతం, అబద్ధంగా చూపించే ప్రయత్నం రాజకీయం మాత్రమే చేయగలదు. నిజాన్ని ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి. 

ఔను, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌పై భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిజం. ఖర్మ ఏంటంటే, అది 'నిజం' అని పదే పదే చెప్పుకోవాల్సి రావడం. ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆ తర్వాత కాంగ్రెస్‌ నేత నిరుపమ్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. సిగ్గుపడాల్సిన విషయమిది. పాకిస్తాన్‌లో క్రికెటర్లు, రాజకీయ నాయకులు, మీడియా.. అంతా ఒక్కటై నిజాన్ని అబద్ధంగా బుకాయించేస్తున్నాయి. మన దేశంలో నిజాన్ని, నిజంగా అంగీకరించడానికి మనసొప్పడంలేదు. 

భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం.. మన గొప్పతనం.. అని ఇలాంటి సందర్భాల్లో చెప్పుకోడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇది భారత సైన్యానికి పెడుతున్న అగ్ని పరీక్ష. పరీక్ష కాదిది, భారత సైన్యంపై అనుమానం. సిగ్గు సిగ్గు. ఓ మూర్ఖుడేమో, సైన్యంలో చేరి, తుపాకీ పట్టుకుని బోర్డర్‌లో ఎవడుండమన్నాడు.? అందుకే చచ్చాడు.! అంటూ వెకిలితనం చేస్తాడు. వాడికి తెలియదేమో, సైన్యం అలా ప్రాణాలకు తెగించబట్టే, ఆ మాట అలా వాడు మీడియా ముందుకొచ్చి చెప్పగలిగాడని.! 

సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన విషయాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిన కాస్సేపటికే, వాటిని ధృవీకరించింది పాక్‌ ప్రభుత్వం. అన్యాయం, అక్రమం, దుర్మార్గం.. అంటూ పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భగ్గుమన్నారు. భారతదేశం తమపై దండెత్తుతోందంటూ వాపోయారు. ఇంతకన్నా సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయనడానికి ఆధారాలు ఇంకేం కావాలి.? దాదాపు 40 మంది తీవ్రవాదులు ఈ ఆపరేషన్‌లో చనిపోయారన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుంచి అందుతున్న సమాచారం. 

స్ట్రైక్స్‌ జరిగిన ప్రాంతం పాకిస్తాన్‌ ఆక్రమణలో వుంది. అక్కడికి మన మీడియా వెళ్ళేందుకు ఆస్కారమే లేదు. సైన్యం, ఇష్టమొచ్చినట్లుగా 'చనిపోయినవారి సంఖ్యను' ప్రకటించే వీలు లేదు. అందుకే, హుందాగా ఆ విషయాన్ని ప్రకటించలేదు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ఆపరేషన్‌పై, అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఎలాంటి పరిణామాలకు తావిస్తుందోనని భారత ప్రభుత్వం కూడా వివరాల్ని గోప్యంగా వుంచింది. 

ఇదిగో ఆధారం.. తాజాగా ఓ మీడియా సంస్థ జరిపిన పరిశోధనలో వాస్తవాలు వెల్లడయ్యాయి. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన ప్రాంతాల నుంచి పెద్దయెత్తున మృతదేహాల్ని వాహనాల్లో తరలించారంటూ ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని భారతదేశానికి చెందిన ఓ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. బోర్డర్‌ నుంచి ఎంతెంత దూరంలో ఎక్కడెక్కడ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయో సవివరంగా ఆ మీడియా కథనం పేర్కొంది. పాకిస్తాన్‌ ఆర్మీ స్వయంగా మృతదేహాల్ని తరలించడాన్ని బట్టి చూస్తే, 'ఆధారాల్లేకుండా చేసేందుకు' పాకిస్తాన్‌ ఏ స్థాయిలో సన్నద్ధమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. 

'40 మంది కాదు, ఇంకా ఎక్కువమంది తీవ్రవాదులే చనిపోయి వుండొచ్చు.. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోడానికి పాకిస్తాన్‌కి ధైర్యం సరిపోవడంలేదు.. ఎందుకంటే అది తీవ్రవాదుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తుంది..' అంటూ పాకిస్తాన్‌కి చెందిన కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఇదిలా వుంటే, సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సంబంధించి పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వం త్వరలోనే భారత ప్రజల ముందుంచనుంది. ఇందులో దాచడానికేమీ లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ని దోషిగా నిలబెట్టేందుకోసం కాస్తంత సంయమనం పాటిస్తోందంతే. డ్రోన్లతో వీడియో చిత్రీకరించి మరీ, సర్జికల్‌ స్ట్రైక్స్‌ని భారత సైన్యం నిర్వహించింది గనుక.. ఆ 'మైండ్‌ బ్లోయింగ్‌' ఆపరేషన్‌ వివరాలు అతి త్వరలో.! అప్పటిదాకా, సోకాల్డ్‌ పొలిటికల్‌ మూర్ఖులు.. రాజకీయాన్ని పక్కన పెట్టి, సైన్యానికీ భారత ప్రభుత్వానికీ అండగా నిలవాలని ఆశిద్దాం.

Show comments