ఎట్టకేలకు 'అమ్మ' మాట్లాడుతోంది.!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతున్నారట. దాదాపు నెల రోజుల తర్వాత, చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రి నుంచి జయలలిత ఆరోగ్యంపై ఓ మోస్తరు స్పష్టతతో కూడిన ప్రకటన ఇది. గత నెల అంటే సెప్టెంబర్‌ 22వ తేదీన జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఇప్పటిదాకా జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి స్పష్టతా లేదు. 

మొదట్లో కొద్ది రోజులు మెడికల్‌ బులెటిన్లు విడుదలయ్యాయి ఆసుపత్రి నుంచి అధికారికంగా. ఆ తర్వాత అవి ఆగిపోయాయి. జయలలిత అభిమానుల ఆందోళనలతో, బులెటిన్‌ పేరుతో అర్థం పర్థం లేని స్టేట్‌మెంట్లను విడుదల చేసింది ఆసుపత్రి యాజమాన్యం. విదేశాల నుంచి వైద్యులొచ్చారు.. వెళ్ళారు. కానీ, జయలలిత అనారోగ్యంపై సస్పెన్స్‌ అలాగే కొనసాగుతోంది. 

దాదాపు పది రోజుల విరామం అనంతరం జయలలిత ఆరోగ్యానికి సంబంధించి నేడు ఓ బులెటిన్‌ విడుదలయ్యింది. అందులో, జయలలిత మాట్లాడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. 'హమ్మయ్య.. గండం గట్టెక్కినట్లే..' అని ఇప్పుడు జయలలిత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, ఇంకొన్ని రోజులపాటు జయలలిత ఆసుపత్రిలోనే వుండాలట. మరోపక్క, జయలలిత నివాసంలో, ఆమె కోసం ఆసుపత్రి వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో వెంటిలేటర్‌ కూడా ఓ భాగమని తెలుస్తోంది. 

పరిస్థితి ఎంత సీరియస్‌ కాకపోతే, ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తికి సంబంధించి ఇంతలా సస్పెన్స్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తారు.? అయినా, ఇప్పుడు జయలలిత మాట్లాడుతున్నారని ప్రకటన చేయడమంటే, ఇన్నాళ్ళూ ఆమె మాట్లాడలేదా.? అలాగైతే నిన్న మొన్నటిదాకా జరిగిన అధికారిక నిర్ణయాల మాటేమిటి.? ఇవన్నీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే. ఎందుకంటే ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ తమిళనాడు అంతే.

Show comments