ఏపీ కేబినెట్‌లో ఇదే నిర్ణయిస్తారా?

హైదరాబాదులోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణ సర్కారుకు చంద్రబాబు ప్రభుత్వం అప్పగిస్తుందా? అప్పగించదా? ఏపీకి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఈ అనుమానం కలుగుతోంది. తెలంగాణ సచివాలయ భవనాలతో పాటు ఏపీకి కేటాయించిన భవనాలను కూడా కూలగొట్టి అత్యాధునికమైన, అద్భుతమైన, అపురూపమైన భవనాన్ని కట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఏదైనా అనుకుంటే ఇంక కిందా మీదా నిలవడు.  కార్తీక మాసంలో సచివాలయ భవనాలు కూల్చి శంకుస్థాపన చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. సచివాలయ భవనాలతోపాటు అసెంబ్లీ భవనాలు కూడా అప్పగించాలని రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ద్వారా చెప్పించారు. 

తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం కలిగిస్తున్న నరసింహన్‌ మొన్న ఆంధ్రాకు వెళ్లినప్పుడు చంద్రబాబుకు ఈ విషయం చెప్పడం, ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిపోయింది. ఏపీ సచివాలయం భవనాలు ఇస్తున్నందుకు ప్రతిఫలంగా హైదరాబాదులో ఢిల్లీ తరహాలో ఏపీ భవన్‌ కట్టుకునేందుకు సహకరించాలని బాబు కోరారు. దాని నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారని వార్త వచ్చింది.  ఏపీ సచివాలయం అప్పగిస్తే అందులో ఉన్న కొద్దిమంది సిబ్బంది కోసం ఓ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. 

తెలంగాణ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వెళతామని బాబు చెప్పిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివాదాస్పద ప్రకటన చేశారు. ఏమిటది? 'రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థల పంపకం విషయం తేలేవరకు సచివాలయం భవనాలు అప్పగించబోం' అని  అన్నారు. సచివాలయాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్న కేసీఆర్‌ సర్కారుకు ఈ ప్రకటన షాక్‌ వంటిదే. అయితే ఇది బోండా వ్యక్తిగత అభిప్రాయమా? చంద్రబాబుకు తెలిసే ఈ ప్రకటన చేశారా? అనేది తేలాల్సివుంది. దీనిపై చంద్రబాబు స్పష్టత ఇస్తే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కొట్లాట రాకుండా ఉంటుంది. 

కేసీఆర్‌ నిన్న (శుక్రవారం) గవర్నర్‌ను కలిసి భవనాలు అప్పగించే విషయంలో ఏపీ నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని కోరారు. ఈ నెల 31న ఏపీ కేబినెట్‌ సమావేశం జరగబోతోందని, కాబట్టి అందులో ఈ విషయం చర్చించేలా చూడాలన్నారు.  చంద్రబాబు గవర్నర్‌తో మాట్లాడినప్పుడు భవనాలు ఇచ్చేందుకు అంగీకరిస్తూనే ఈ విషయమై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేబినెట్‌ సమావేశానికి ముందు బోండా ప్రకటన చేయడంతో బాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 9,10 షెడ్యూళ్లలోని సంస్థల సంగతి తేల్చందే భవనాలు అప్పగించకూడదనేది కేవలం బోండా అభిప్రాయమే కాదు. మంత్రులు కూడా ఇదే సంగతి చెప్పారట. 

మరి బాబు ఈ విషయం ఆలోచించకుండా గవర్నర్‌కు ఎలా మాట ఇచ్చారో అర్థం కావడంలేదు. చట్ట ప్రకారం హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధాని. కాని బాబుకు అధికారం ఐదేళ్లవరకే ఉంది. అంటే 2019 వరకు. ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయన పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో లేదో తెలియదు. ఈయన ముఖ్యమంత్రి అవుతాడో కాదో తెలియదు. ఇలాంటప్పుడు పదేళ్లపాటు ఏపీ ప్రజలు ఉపయోగించుకోవాల్సిన హైదరాబాదును ఈయన ఏకపక్షంగా ఎలా వదులుకుంటారు? అలా వదులుకునే హక్కు చంద్రబాబుకు (ఆయన సర్కారుకు) ఉందా? 

హైదరాబాదులో ఏపీకి కేటాయించిన సచివాలయాన్ని, అసెంబ్లీ భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించేస్తే ఉమ్మడి రాజధానిపై హక్కు వదులుకున్నట్లేనని టీడీపీ మంత్రులు, నాయకులే అభిప్రాయపడుతున్నారు. 'హైదరాబాదుపై హక్కు వదులుకోవద్దు' అని గట్టిగా కోరుతున్నారు. ఒకప్పుడు హైదరాబాదులో ఏపీ పోలీసు స్టేషన్లు పెడతామని దూకుడుగా మాట్లాడిన బాబు ఇప్పుడు సామరస్య మంత్రం వల్లిస్తున్నారు. ఇందుకు కారణం నోటుకు ఓటు కేసు.  సచివాలయం, అసెంబ్లీ ఇచ్చినందుకు తెలంగాణ సర్కారు ఆంధ్రాకు చేకూర్చే ప్రయోజనం ఏమిటి? అడగ్గానే ఇచ్చేయడమేనా? ఇదీ టీడీపీ నేతలతో సహా ఏపీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. 

విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థలను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది. కాని ఇందుకు తెలంగాణ సర్కారు 'ససేమిరా' అంటోంది. సచివాలయం, అసెంబ్లీ భవనాలు అడుగుతున్న తెలంగాణ పభుత్వం సంస్థల విభజన విషయంలో ఏపీకి సహకరించడంలేదు. 9,10 షెడ్యూళ్లకు సంబంధించి ఏపీకి న్యాయం జరిగేవరకు సచివాలయం, అసెంబ్లీ అప్పగించొద్దని టీడీపీ నాయకులు, మంత్రులు బాబును కోరుతున్నారు. పదేళ్లపాటు హక్కుంది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. కేసీఆర్‌కు అనుకూలంగా బాబు నిర్ణయం తీసుకుంటే ఏపీ నష్టపోదా? 

Show comments