ఏమిటో ఈ తెలుగుదేశం గోల!

ఒక దాంట్లో డబుల్ టోన్ అయితే ఏదోలే అనుకోవచ్చు. ప్రతి వ్యవహారంలోనూ డబుల్ లోనేనా? వినే జనాలకు కూడా విసుగు వచ్చేలా.. ఉసర వెల్లులు కూడా చిన్నబోయేలా రాజకీయాలు చేస్తోంది పసుపు పార్టీ. రాష్ట్ర విభజన అంశం  వంటి కీలక వ్యవహారంలో కూడా టీడీపీ అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడిందనే విషయాన్ని పక్కన పెట్టినా, ఏపీలోనే విభజన పాపం కాంగ్రెస్ ది, అడ్డ దిడ్డంగా విభజనకు పాల్పడ్డారని అంటూ తెలంగాణలోనేమో నా లేఖ వల్లనే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది అంటూ.. ఇప్పటికీ తెలుగుదేశం అధినేత తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిస్తున్నాడు.

ఆ ఒక్క వ్యవహారంలోనే  కాదు.. ప్రతి వ్యవహారంలోనూ డబుల్ టోనే. నోట్ల మార్పిడి వ్యవహారంలో.. తొలిరోజు బాబు మాట్లాడుతూ గొప్ప నిర్ణయం,  నా సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్న ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక బాబు భజంత్రీ మీడియా అయితే.. ఫలించిన బాబు పోరాటం అంటూ హెడ్డింగులు పెట్టింది.

అయితే జరిగింది నోట్ల రద్దు కాకపోయినా.. బాబు క్రెడిట్ కోసం ఆరాటపడ్డాడు. తీరా.. ఈ వ్యవహారం అడ్డం తిరగడం, నోట్ల కొరతతో జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటంతో… బాబు మాట మార్చారు. తన జీవితంలోనే ఇంత దారుణాతి దారుణాన్ని చూడలేదనేశాడు! జనాగ్రహం వ్యక్తం అయ్యే సరికి బాబు ఇలా అడ్డం తిరిగారు.

ఇక బంగారం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానం విషయంలో తెలుగుదేశం స్పందిస్తూ.. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ‘తుగ్లక్ ‘ నిర్ణయంగా అభివర్ణించింది. మోడీ పాలనను తుగ్లక్ పాలనతో అభివర్ణించారు తెలుగుదేశం నేతలు. ఈ మాట ఎంత తీవ్రమైనదో వేరే చెప్పనక్కర్లేదు.

ఇన్ని మాట్లాడుతున్న తెలుగుదేశం అదే తుగ్లక్ ప్రభుత్వంలో భాగస్వామి! అయినా.. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడు బంగారం విషయంలో ప్రజా వ్యతిరేకత ఉందని తెలుగుదేశం ఇలా మాట్లాడుతోంది. ఇదే పార్టీ ఎంపీలు ఢిల్లీలో కేంద్రం నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడతారు. పార్లమెంటులో బంగారం విషయంలో చేసిన చట్టానికి తెలుగుదేశం ఎంపీలు కూడా చేతులెత్తి మద్దతు పలికారు!

ఇదీ తెలుగుదేశం కథ. నోట్ల కష్టాల గురించి మోడీని ఏమనరు, బ్యాంకర్లను చంద్రబాబు తిడతాడు! బంగారం విషయంలో పార్లమెంటులో టీడీపీ ఓటేసి మద్దతు పలుకుతుంది.. అమరావతిలో మాత్రం మోడీ పాలనను తుగ్లక్ పాలన అంటారు! తెలంగాణ విషయంలో విభజనకు లేఖ ఇచ్చి కూడా ఏపీలో అధికారంలోకి వచ్చేసరికి టీడీపీకి ఈ డబుల్ డ్రామాలు బాగా అలవాటుగా మారినట్టున్నాయి. 

Show comments