యూరీ సైన్య క్షేత్రంపై పాక్ ముష్కరుల దాడి నేపథ్యంలో.. 18 మంది భారతీయ సైనికులు అమరులైన నేపథ్యంలో… పాక్ పై భారత ప్రభుత్వ తీరు విషయంలో మెజారిటీ భారతీయుల్లో అసంతృప్తి నెలకొని ఉందని అంటున్నాయి అధ్యయనాలు. పాక్ పై భారత్ తక్షణం సైనిక చర్యకు పూనుకోవాలి.. అని మెజారిటీ భారతీయులు అభిప్రాయపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దొంగ దెబ్బ కొట్టిన పాక్ విషయంలో ఉపేక్షించనక్కర్లేదని.. పాక్ ను గట్టి దెబ్బ తీయాలని, సైనిక చర్యనే దీనికి పరిష్కార మార్గమని భారతీయులు అభిప్రాయపడుతున్నారు.
ఒక వార్తా సంస్థ తన వెబ్ సైట్ ద్వారా జరిపిన అధ్యయనంలో దాదాపు లక్షా పదివేల మంది పాల్గొనగా వారిలో దాదాపు 67 వేల మంది పాక్ పై సైనిక చర్య నే పరిష్కారం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే దాదాపు 66.6 శాతంమంది పాక్ కు తుపాకీ గుళ్లతోనే సమాధానం చెప్పాలని అంటున్నట్టు.
27,500 మంది నాన్ మిలటరీ రెస్పాన్స్ ను కోరుకుంటున్నారు.. పాక్ కు నిరసన తెలపడం, దౌత్య పరమైన చర్చలతో పాక్ కు తీరును ఎండగట్టడం, అంతర్జాతీయ వేదిక లపై పాక్ ను ఒంటరిని చేయడం.. తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఐదు వేలమంది నెటిజన్లు.. సైనిక చర్యను సమర్థించ లేదు. వీరి శాతం 4.6. మరో నాలుగు శాతం మంది పాక్ కు గట్టి హెచ్చరికను జారీ చేసి .. చర్యలను చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
ఈ అధ్యయనం సంగతిలా ఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్ సమయంలో ఒక అమెరికన్ సంస్థ ఉగ్రవాదం, ఐసిస్, పాక్ తదితర అంశల గురించి భారతీయుల అభిప్రాయాలతో చేసిన ఒక అధ్యయన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉగ్రవాదాన్ని అణచడానికి సైనిక చర్య నే పరిష్కారం అని మెజారిటీ భారతీయులు అభిప్రాయపడుతున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం విషయంలో కూడా వీరు ఇదే పరిష్కారమని వీరు అంటున్నారు.
ఇక పాక్ విషయంలో మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని కేవలం 22 శాతం మంది మాత్రమే ఆమోదించడం గమనార్హం. గత రెండేళ్ల పరిణామాల నేపథ్యంలో పాక్ తో ప్రభుత్వ వైఖరి పట్ల ఏకంగా 78 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. అది ఏప్రిల్ నాటి పరిస్థితి. తాజా సంఘటనల నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించ బోయే తీరు, వీరిపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.