యేరు దాటాక.. తెప్ప తగలేసి...

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ పేరు చెబితే తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు భయపడ్తోంది.? 

- ఈ ప్రశ్నకు సమాధానమే దొరకడంలేదు. 

నిజానికి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి తిరుగులేదు. వందేళ్ళ చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీగానీ, థర్టీ ఇయర్స్‌ పైన పొలిటికల్‌ అనుభవం వున్న తెలుగుదేశం పార్టీగానీ.. ఆఖరికి కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీగానీ, ప్రజా ఉద్యమాల్లో ఆరి తేరిన వామపక్షాలుగానీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ముందు నిలబడలేక కుప్ప కూలిపోతున్నాయి. వీటిల్లో బీజేపీ కాస్త బెటర్‌ అంతే. ఎందుకంటే, బీజేపీని తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అనధికారికంగా మిత్రపక్షంగానే చూస్తోంది మరి. 

ఇంతగా తమకు తెలంగాణలో అనుకూల పరిస్థితులు వున్నప్పుడు తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ని చూసి టీఆర్‌ఎస్‌ భయపడాల్సిన అవసరమే లేదు, కానీ భయపడ్తోంది. ఎందుకంటే, మల్లన్నసాగర్‌ వివాదంలో విపక్షాలన్నీ ఓ ఎత్తు.. కోదండరామ్‌ ఒక్కరూ ఒక ఎత్తు. కోదండరామ్‌ దెబ్బకి, తెలంగాణ సర్కార్‌ కుదేలయ్యింది. దాంతో, కోదండరామ్‌ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆచి తూచి వ్యవహరిస్తోంది. కోదండరామ్‌ తమకు పక్కలో బల్లెంలా తయారయిన దరిమిలా, ఆయన్ని డైల్యూట్‌ చేయడానికి ఎంపీ బాల్క సుమన్‌ని టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా రంగంలోకి దించింది. 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్‌ది కీలక పాత్ర. కోదండరామ్‌ది అనడంకన్నా, తెలంగాణ జేఏసీది కీలక పాత్ర అనడం సహజం. దాన్ని నడిపించాలనుకున్నది కేసీఆర్‌ అయినా, నడిపించింది మాత్రం కోదండరామే. ఓ దశలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ జేఏసీ పలు కార్యక్రమాలు చేపట్టింది. అవి సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి కూడా. అప్పట్లోనే కోదండరామ్‌ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగినా, అవి సక్సెస్‌ కాలేదు. 

తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్‌, కోదండరామ్‌ని దూరం పెట్టేశారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్ళు మౌనం దాల్చినా, తెలంగాణ జేఏసీ తరఫున ప్రజా ఉద్యమాలకు కోదండరామ్‌ శ్రీకారం చుట్టడం కేసీఆర్‌కి మరింత కంటగింపుగా తయారయ్యింది. పైగా, 'పరిపాలించడం చేతకాకపోతే దిగిపో..' అని కేసీఆర్‌ని ఉద్దేశించి కోదండరామ్‌ చేసిన వ్యాఖ్యలతో దుమారం ముదిరి పాకాన పడింది. 

తాజాగా, కోదండరామ్‌ మరోసారి కేసీఆర్‌పై చెలరేగిపోయారు. 'ఓ డాక్టర్‌ సరైన మందులు ఇవ్వకపోతే, ఇంకో డాక్టర్‌ దగ్గరకు వెళ్తాం కదా..' అని చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ షాక్‌కి గురయ్యింది. కోదండరామ్‌ తెలంగాణ జేఏసీ ముసుగులో వ్యక్తిగత రాజకీయ ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ఆరోపించారు. సాయంత్రానికి మరికొందరు ముఖ్య నేతలు, కోదండరామ్‌పై దుమ్మెత్తిపోసే అవకాశాలున్నాయి. 

విచిత్రమేంటంటే, 'ఎవరేమనుకున్న డోన్ట్‌ కేర్‌..' అన్నట్టుంది కోదండరామ్‌ వ్యవహారం. తెలంగాణలో కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్థులంతా బిక్కుబిక్కుమంటోంటే, కోదండరామ్‌కే ఈ ధైర్యమేంటట.? యేరు దాటాక తెప్ప తగలేసిన చందాన, తెలంగాణ జేఏసీని గాలికొదిలేసిన టీఆర్‌ఎస్‌, ఇప్పుడు కోదండరామ్‌పై విరుచుకుపడ్డం ద్వారా తాను భయపడ్తున్న విషయాన్ని తన చర్యలతో చెప్పకనే చెబుతోంది. చాలా చిత్రమైన సందర్భం కదా ఇది.!

Show comments