నిన్నలా మొన్న.. ఐవైఆర్ పై వేటుతో చంద్రబాబు ప్రభుత్వం జాతీయ స్థాయి వార్తా కథనాల్లో ప్రముఖంగా నిలిచింది. అంతకు ముందు.. జేసీ దివాకర్ రెడ్డి వైజాగ్ ఎయిర్ పోర్టులో క్రియేట్ చేసిన రభసతో తెలుగుదేశం పార్టీ పేరు నేషనల్ మీడియాలో మార్మోగింది.
అంతకు వారం కిందట కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ వస్తోందని అంబులెన్స్ ను అరగంట పాటు ఆపడం నేషనల్ మీడియాలో అలజడిని పుట్టించింది.. ఈ పరంపరలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఓటర్లకు జారీ చేసిన హెచ్చరిక అంశం జాతీయ మీడియాలో ప్రముఖమైన వ్యవహరం అయ్యింది.
ఒక చోటని కాదు.. జాతీయ మీడియాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పేరు, చంద్రబాబు పేరు అనేక చోట్ల, అనేక వ్యవహారాల్లో అగుపిస్తోంది. ఒక్క పాజిటివ్ వ్యవహారం లేక అన్నీ నెగిటివ్ వ్యవహారాలతోనే తెలుగుదేశం పార్టీ పేరు, చంద్రబాబు పేరు నేషనల్ మీడియా వార్తా కథనాల్లో చోటు సంపాదించుకోవడం గమనార్హం.
వాస్తవానికి జాతీయ మీడియా ఏపీలో జరుగుతున్న వ్యవహారాలపై శోధించి, ఛేదించేది ఏమీ లేదు. నేషనల్ మీడియా కన్ను ఎప్పుడూ ఉత్తరాది మీద ఢిల్లీ మీదే ఉంటుంది. ఢిల్లీలో ఎవరైనా తుమ్మినా దానిపై రోజంతా రాద్ధాంతం చేస్తూ ఉంటాయి ఆంగ్ల మీడియా వర్గాలు.
అలా ఆ ధ్యాసలోనే బతికేసే ఆ మీడియా వర్గాలను దక్షిణాది నుంచి ఎవరైనా ఆకర్షిస్తున్నారంటే అది చంద్రబాబు, ఆయన పార్టీలోని వారే. బాబుగారు విదేశీ పర్యటనలకు ఖర్చు చేసిన మొత్తం, అలాగే బాబుగారు తన కాన్వాయ్ లకు, ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసుకుంటున్న ఇళ్ల అంశంపై నేషనల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి.
ఆ రేంజ్ లో ఉంది బాబుగారి వ్యవహారం. కేవలం బాబుగారే నేషనల్ మీడియాకు ఎక్కితే బాగుండదన్నట్టుగా కోడెల శివప్రసాదరావు లాంటి వాళ్లు కూడా అడపాదడపా జాతీయ మీడియా వార్తల్లో నిలిచారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓటర్లను బాబు బెదిరించడం అన్నింటినీ మురిపిస్తోంది.
ఏపీ సీఎం ఇలా మాట్లాడాడు, అంత మూర్ఖంగా మాట్లాడారు.. ప్రభుత్వ సొమ్ముతో చేసిన పనులన్ని తన ఇంట్లోంచి తెచ్చిన సొమ్ముతో చేసినట్టుగా జనసామాన్యానాన్ని బెదిరించేస్తున్నాడని నేషనల్ మీడియా వర్గాలు ప్రముఖంగా పేర్కొంటున్నాయి. మొత్తానికి జాతి మీడియాలోనే కాదు.. జాతీయ మీడియాలోనే బాబు పేరు మార్మోగుతోంది.