ఎమ్బీయస్‌: థాయ్‌లాండ్‌ ఆర్మీ నీడలో రాజ్యాంగ సంస్కరణలు

థాయ్‌లాండ్‌లో ఆగస్టు మొదటివారంలో కొత్త రాజ్యాంగం పై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 1932లో రాజుగారి నుంచి ప్రజలకు అధికారం బదిలీ అయ్యాక, పాత రాజ్యాంగాన్ని రద్దు చేసి, కొత్త రాజ్యాంగాన్ని చేపట్టడం 19 సార్లు జరిగింది. ఇవన్నీ మిలటరీ వాళ్లు రాసినవే. ఇప్పుడీ యిరవయ్యో రాజ్యాంగం కూడా 2014 మేలో హింసాత్మకంగా కుట్ర చేసి అధికారంలో వచ్చిన మిలటరీ వారి చలవే. 1932 నుంచి యిప్పటిదాకా వాళ్లు 12 సార్లు హింసాత్మకంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దశాబ్దాలుగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, సైన్యపాలన ఏర్పడడం వంటివి నివారించడానికి ఈ రాజ్యాంగం ప్రకారం 2017 నవంబరులో ఎన్నికలు నిర్వహించి, సుస్థిర ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి యిది తొలిమెట్టు అంటూ వారీ రిఫరెండం నిర్వహించారు. దీని ప్రకారం కూడా అధికారమంతా మిలటరీ చేతిలోనే వుండేట్లు చూసుకున్నారు. అందుకే 55% మంది మాత్రమే ఓట్లేశారు. వేసినవారిలో 60% మంది కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారని ప్రకటించారు. ఇక థాయ్‌లాండ్‌ యొక్క 6 కోట్ల 80 లక్షల మంది ప్రజలు దాని ప్రకారమే పాలింపబడతారు. దాని ప్రకారం ఎగువ సభ, దిగువ సభ వుంటాయి. ఎగువ సభలోని 250 మంది మిలటరీచేతనే నియమింపబడతారు. దిగువ సభలో 500 స్థానాలుంటాయి. ఎన్నికలలో పార్టీలు తెచ్చుకున్న ఓట్ల నిష్పత్తిలో కొన్ని, నియోజకవర్గాల నిష్పత్తిలో కొన్ని నింపుతారు. ప్రధానిని ప్రజలు నేరుగా ఎన్నుకోనవసరం లేదు. ఈ రెండు సభలు ఎవర్ని ఎన్నుకుంటే వారే ప్రధాని. దిగువ సభలో వున్న వేర్వేరు పార్టీల వాళ్లు ఒక్కతాటిపై రావడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచడం జరగని మాట. అందువలన మిలటరీ ఏమనుకుంటే అది, దాని ప్రతినిథులతో నిండిన ఎగువ సభ ద్వారా అమలవుతుంది. 

గతంలో ప్రధానిగా పనిచేసిన టెలికామ్‌ మొఘల్‌ తక్సిన్‌ షినవత్రా అధికారంలోకి రాకుండా చూడడానికే మిలటరీ యీ జాగ్రత్తలు తీసుకుంటోందని పరిశీలకులు భావిస్తున్నారు. అతనికి పేదవారిలో, రైతుల్లో, కులీనవర్గాల్లో, రాజుగారితో సైతం మంచి పలుకుబడి వుంది. 2001 నుంచి అతన్ని అనేకసార్లు ఎన్నుకున్నారు. కానీ రెండు సార్లు అతని ప్రభుత్వాలను మిలటరీవాళ్లు కూలదోశారు. మూడుసార్లు కోర్టులు రద్దు చేశాయి. అతను అధికార దుర్వినియోగం చేశాడని, అవినీతికి పాల్పడ్డాడని కోర్టులు 2008లో తీర్పు వెలువడ్డాక అతను ప్రవాసంలో నివసించసాగాడు. అయితే అతను కుటిల రాజకీయవేత్త. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలడు. 2014లో అతని అభిమానులు కొందరు అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలని, దేశానికి తిరిగి తీసుకుని వచ్చి 1.2 బిలియన్‌ డాలర్ల అతని ఆస్తిని అతనికి అప్పగించాలని సూచించారు. దానికి నిరసనగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఆ ప్రదర్శనలు సాకుగా చూపి మిలటరీ అధికారాన్ని తన చేతిలోకి తీసుకుంది.  అలా తీసుకోవడాన్ని థాయ్‌లాండ్‌కు ఎప్పణ్నుంచో సన్నిహితంగా వున్న అమెరికా ఆమోదించలేదు. దానిపై ఆర్థిక అంక్షలు విధించింది. ఇస్తానన్న కోట్లాది సహాయాన్ని నిలిపివేసింది. అదే అదనుగా చైనా, రష్యా రంగంలోకి దిగి సైన్యపాలనకు అండగా నిలబడింది. 

వీరితో బాటు థాయ్‌లాండ్‌ ఉన్నతవర్గాలు కూడా సైన్యానికి మద్దతు యిస్తున్నాయి. థాయ్‌లాండ్‌ రాజు భూమిబల్‌ అదుల్యదేజ్‌ అంటే ప్రజలకు గౌరవం. ప్రభుత్వాలు కూడా ఆయన మాట గౌరవిస్తాయి. కానీ ఆయన వయసు 88. అనారోగ్యంగా వున్నాడు. ఆయన కేదైనా అయితే ప్రజలను అదుపు చేసేవారు లేరు. ఎందుకంటే ఆయన కొడుకు మహావజ్రలంగకర్ణ అనేక స్కాండల్స్‌లో యిరుక్కుని మర్యాద పోగొట్టుకున్నాడు. ప్రజలు తిరగబడిన పక్షంలో వారిని వారించగల స్థాయిలో వున్న రాజుగారికి ఏదైనా జరిగితే, రాజమహల్‌ ప్రభావం ప్రభుత్వంపై లేకుండా పోతుందని, తమకు ముప్పు వాటిల్లుతుందని ఉన్నతవర్గాలు భయపడ్డాయి. వారికి అభయం యివ్వడానికి, తమతో పాటు వారికీ న్యాయపరమైన రక్షణను యీ రాజ్యాంగంలో కల్పించింది మిలటరీ. ఇవన్నీ మేధావుల విమర్శలకు గురవుతాయని తెలుసు కాబట్టి రాజ్యాంగంపై చర్చలు అనుమతించలేదు. వ్యాఖ్యలు చేసిన విమర్శకులను, పాత్రికేయులను జైలుపాలు చేసింది. ఎన్నికల నిర్వహణ ఎలా జరుగుతుందో పర్యవేక్షించడానికి స్వతంత్ర ఏజన్సీ ముందుకు వస్తే దాన్ని అనుమతించలేదు. ఇలాటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నిక ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిందని ఎలా అనగలం? (ఫోటో - తక్సిన్‌ షినవత్రా)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016) Readmore!

mbsprasad@gmail.com

Show comments