టీడీపీని ముంచేయనున్న ఫిరాయింపు

'మాకు గెలిచే నాయకులు కావాలి మొర్రో..' అంటూ టీడీపీ దయనీయ స్థితిని చంద్రబాబు చాటేసుకున్నారు నంద్యాల నియోజకవర్గంలో మొన్నీమధ్యనే పర్యటించినప్పుడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటినుంచి, ఇప్పటిదాకా.. గడచిన మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఇంతటి దయనీయ స్థితి దాపురించలేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి సరిపోయిందిగానీ, లేదంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితెలా వుందో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీకి అదే దుస్థితి దాపురించేది. ఇందులో ఇంకో మాటకు తావులేదు. చంద్రబాబు భయం కూడా అదే. ఆ భయమే, ఆయన మాటల్లో స్పష్టమయ్యింది. 

కర్నూలు జిల్లాకు సంబంధించినంతవరకు శిల్పా బ్రదర్స్‌ పనైపోయిందని భావించిన చంద్రబాబు, భూమా కుటుంబాన్ని తెలివిగా టీడీపీలోకి లాక్కున్నారు. భూమా కుటుంబాన్ని లాక్కుని, శిల్పా కుటుంబాన్ని లైట్‌ తీసుకున్న చంద్రబాబు, శిల్పా మోహన్‌రెడ్డిని కోల్పోయిన విషయం విదితమే.

చంద్రబాబు టార్చర్‌ తట్టుకోలేక, శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి, వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఇంకోపక్క, చంద్రబాబు కలలు కల్లలైపోయాయి.. భూమా నాగిరెడ్డి మరణంతో, ఆయన్నే నమ్ముకున్న చంద్రబాబు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో, నంద్యాల ఉప ఎన్నికల్లో తేలనుంది. 

ఇక, కడప జిల్లా రాజకీయానికొస్తే జమ్మలమడుగులో టీడీపీ కీలక నేత అయిన రామసుబ్బారెడ్డిని సైడేసి, వైఎస్సార్సీపీకి చెందిన ఆదినారాయణరెడ్డికి గాలమేశారు చంద్రబాబు. పైగా, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. 'ఎమ్మెల్సీ ఇస్తాంలే..' అని అప్పటికి రామసుబ్బారెడ్డిని బుజ్జగించారుగానీ, ఆ తర్వాత లైట్‌ తీసుకున్నారు.

ఆవేశంతో రగిలిపోయిన రామసుబ్బారెడ్డి, వీరావేశంతో చంద్రబాబు దగ్గరకు వెళ్ళారు. ఏం లాభం.? అటు చంద్రబాబు, ఇటు చినబాబు.. వెరసి రామసుబ్డారెడ్డికి బీభత్సమైన క్లాసులు.. ఇంకేముంది, రామసుబ్బారెడ్డి ఫేస్‌ డల్‌ అయిపోయింది. 

'35 ఏళ్ళ అనుబంధం మాది.. టీడీపీని వీడేది లేదు..' అని పైకి చెప్పారుగానీ, చంద్రబాబు తనకు అన్యాయం చేశారన్న విషయం ఆయన బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కన్పించింది. ఇక్కడికిలా రామసుబ్బారెడ్డిగారి ఆవేశాన్ని చంద్రబాబు చల్లార్చేశారుగానీ, 2019 ఎన్నికల్లో టీడీపీని గెలిపించే సత్తా ఆదినారాయణరెడ్డికి వుందా.? రామసుబ్బారెడ్డి రివర్స్‌ గేర్‌ వేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి.? 

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేయడంలో తనదైన రాజకీయ మంత్రాంగాన్ని ఉపయోగించిన చంద్రబాబు, ఆయా నియోజకవర్గాల్లో టీడీపీని పూర్తిగా దెబ్బతీసేశారన్నది నిర్వివాదాంశం. బాబు రాజకీయానికి చినబాబు తెలివితేటలు తోడైతే, టీడీపీ తట్టుకోగలదా.? ఛాన్సే లేదు.

Show comments