మీరాకుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు బలపర్చిన అభ్యర్థి. అధికారికంగా విపక్షాలన్నీ కలిసి మీరాకుమార్ పేరుని ఈ రోజు ప్రకటించాయి. మీరాకుమార్ కాంగ్రెస్ నేత. 2009 నుంచి 2014 వరకు ఆమె లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన విషయం విదితమే.
మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తెగా మీరాకుమార్ రాజకీయాల్లో అందరికీ సుపరిచితురాలే. లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందడం వెనుక స్పీకర్‌గా మీరాకుమార్ 'పాత్ర' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
నిబంధనలకు పాతరేసి, బిల్లుని పాస్ చేయించారన్న విమర్శలు ఆమెపై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నేతలు చేస్తే, అత్యంత సాహసోపేతంగా ఆ బిల్లుని పాస్ చేయించారని అప్పట్లో తెలంగాణకు చెందిన నేతలు మీరాకుమార్‌పై పొగడ్తలు గుప్పించారు.
నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి గెలిచే అవకాశమే లేదు. పూర్తి మెజార్టీ ఎన్డీయే కూటమికి వుంది. కూటమికి చెందిన పార్టీలే కాకుండా, ఇతర పార్టీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరుస్తున్న అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కి మద్దతు పలికారు.
ఈ పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని నిలబెట్టడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. పైగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన మీరాకుమార్‌ని ఓడిపోతారని తెలిసీ రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబెట్టడం విశేషమే మరి.
కాంగ్రెస్ పార్టీ దాదాపుగా హ్యాండ్సప్ అనేసే పరిస్థితుల్లో వున్నా, వామపక్షాలు కాస్తంత గట్టిగా నిలబడ్డాయి, ఎన్డీయే అభ్యర్థికి పోటీగా మరో అభ్యర్థిని నిలబెట్టే విషయమై. ఈ కారణంగానే కాంగ్రెస్ విధిలేని పరిస్థితుల్లో మీరాకుమార్‌ని తెరపైకి తెచ్చిందన్నది నిర్వివాదాంశం.
మోడీకి బద్ధ వ్యతిరేకి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సైతం, రామ్‌నాథ్ కోవింద్‌కి మద్దతు పలికిన తర్వాత, మీరాకుమార్ తనంతట తానుగా అయినా పోటీకి విముఖత వ్యక్తం చేయాల్సి వుంది.
మిగతావారి సంగతెలా వున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకటంలో పడ్డారిప్పుడు మీరాకుమార్ అభ్యర్థిత్వం నేపథ్యంలో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరాకుమార్ పాత్ర గురించి వీలు చిక్కినప్పుడల్లా లెక్చర్లు దంచేస్తుంటారాయన.
మరి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే రామ్‌నాథ్‌కి మద్దతు ప్రకటించిన కేసీఆర్, మీరాకుమార్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక మనసు మార్చుకుంటారా.? వేచి చూడాల్సిందే.