శాతకర్ణి సినిమా కు ముందు బాలకృష్ణ తన వందో సినిమాగా చాలా సబ్జెక్ట్ లు చూసారు. అందులోదాదాపు ఫైనల్ కు వచ్చింది కృష్ణ వంశీ రైతు సినిమా ఒకటి. కానీ లాస్ట్ మినిట్ లో శాతకర్ణి లాంటి మాంచి సబ్జెక్ట్ రావడంతో అటు మొగ్గారు. రైతు సినిమా 101 వ సినిమాగా వుంటుందని వార్తలు వినవచ్చాయి. ఇందులో కీలకమైన పాత్రకు అమితాబ్ ను సంప్రదించారని, ఆ తరువాత ఆయన అంత సుముఖంగా లేరని ఇలా రకరకాల వార్తలు వెలు వడ్డాయిు. ఏదయినా 101 సినిమాగా రైతు వుంటుందని బాలయ్య కూడా ఒకటి రెండు సార్లు అనడం జరిగింది.
కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా 101 వ సినిమా గా రైతు ఉండొకపోవచ్చని తెలుస్తోంది. ఖైదీ సినిమా పక్కా మాస్ మసాలా కావడం, శాతకర్ణి సినిమా పక్కా క్లాస్ కావడంతో పోటీలో బ్యాలెన్స్ కుదరలేదు. ఇదే బాలయ్య కూడా బోయపాటి లాంటి డైరక్టర్ తో సింహా లాంటి సినిమా చేసి వుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అందుకే మళ్లీ వెంటనే కృష్ణవంశీ లాంటి డైరక్టర్ తో రైతు లాంటి క్లాస్ సినిమా కాకుండా వీలయితే బోయపాటితో ఓ మాస్ సినిమా చేయాలని తమ అభిమాన హీరోకు సందేశాలు అందిస్తున్నారు.
అదీ కాక చిరంజీవి 150వ సినిమా ప్లాట్ రైతు సమస్యల మీదనే. ఇప్పుడు బాలయ్య 101 కూడా రైతు సమస్యల మీద అంటే, మెగాస్టార్ ను ఫాలో అయినట్లు వుంటుంది. అందుకే వేరే సబ్జెక్ట్ అయితే బెటర్ అన్న అభిప్రాయం కూడా ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతోంది. అసలే చిన్న చిన్నవయినా ఒకటి రెండు చెణుకులు ఖైదీ సినిమాలో ప్రభుత్వంపై పడ్డాయి. ఇప్పుడు బాలయ్య ఎంత జాగ్రత్తలు తీసుకున్నా 2017 చివరికి వచ్చే రైతు సినిమాలో సమస్యలు ప్రభుత్వంపై ప్రభావం చూపించే ప్రమాదం వుంది.
ఇవన్నీ ఇలా వుంచితే, కృష్ణ వంశీ నక్షత్రం సినిమా ఇంకా పూర్తి కాలేదు. అది అంతా ఫినిష్ అయి, ఆయన ఖాళీ కావడానికి ఇంకా నాలుగు నెలలు పడుతుంది. అప్పటి వరకు బాలయ్య ఖాళీగా వుండాలి. అదే సరైన డైరక్టర్, స్క్రిప్ట్ దొరికితే కనుక ఈ నాలుగునెల్లలో ఓ సినిమా ఫినిష్ చేసేయచ్చు. అందుకే రైతు సినిమా దాదాపు కాస్త వెనక్కే వెళుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.