ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం తెలిసిందే. ఓ పక్క ఆయన ఆత్మస్తుతి చేసుకుంటుంటే, మరోపక్క తమ్ముళ్లు
ఆయన ఎంతటి పరిపాలన దక్షుడో, రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నారో ఊదరగొడుతుంటారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగానే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెబుతుంటారు.
ఆయన కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటోందని విమర్శిస్తుంటారు. ఇది నాణేనికి ఒకవైపు. చంద్రబాబు ఎక్కడలేని గొప్పలు చెప్పుకుంటుంటే
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువయ్యాయని యమ బాధపడిపోతున్నారు. ఇది నాణేనికి రెండో వైపు.
ముఖ్యమంత్రి వెనకాముందు చూసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే డబ్బు సర్దుబాటు చేయలేక యనమల నానా అవస్థలు పడుతున్నారు. ఏ రాష్ట్ర ఆర్థిక మంత్రికైనా ఇలాంటి తిప్పలుంటాయి. కాని చంద్రబాబు నాయుడు విపరీత పోకడల కారణంగా ఏపీ ఆర్థిక మంత్రికి ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉన్నాయి.
యనమల ఆవేదనను మామూలు మాటల్లో చెప్పాలంటే రాష్ట్రం పరిస్థితి పేషెంటు ఐసీయూలో ఉన్నట్లుగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న విషయం
రహస్యమేమీ కాదు. యనమల మీడియాకు చెప్పారు. రెవన్యూ వ్యయం పెరిగిపోయింది. రెవన్యూ లోటు, అప్పులు, ద్రవ్యలోటు, చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. దీన్నంతా అదుపు చేయడం చాలా కష్టంగా ఉందట.
వాస్తవంగా రాష్ట్రం పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, చంద్రబాబు ప్రజలకు 'మాయా బజార్' రంగుల సినిమా చూపిస్తున్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అరకొరగా ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న సహాయం చేయడంలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్న రెవెన్యూ లోటును ఈనాటివరకు భర్తీ చేయలేదు. నామమాత్రంగా కొంత మొత్తం ఇచ్చి చేతులు దులుపుకుంది.
పోలవరం ప్రాజెక్టు ఖర్చు పూర్తిగా కేంద్రం భరిస్తోందనే మాట అవాస్తవం. తడిసిమోపెడవుతున్న దీని ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిందే. అందులోనూ ప్రాజెక్టును నిర్మాణ బాధ్యతను ప్రభుత్వమే నెత్తికెత్తుకుంది. ఇలా చెప్పుకుంటూపోతే చరిత్ర చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలు ఇవ్వలేదు. కరువు భత్యం ఇవ్వలేదు. దీనిపై వారు ఆగ్రహంగా ఉన్నారు.
ఆర్థిక పరిస్థితి ఇలా డొల్లగా ఉంటే చంద్రబాబు మాత్రం యథాప్రకారం గొప్పలు చెప్పుకుంటూపోతున్నారు. తాజాగా యోగా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ''రాష్ట్రం విడిపోయిందని బాధపడుతూ కూర్చుంటే ఇంత అభివృద్ధి సాధించేవాళ్లమా?'' అన్నారు. ఈమధ్య స్టార్టప్ ఏరియాలో నిర్మాణాల కోసం సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఒళ్లు తెలియకుండా మాట్లాడారు.
'రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించమని దేవుడు నన్ను ఆదేశించాడు' అన్నారు. ఇది మత ప్రచారకులు మాట్లాడినట్లుగా ఉందిగాని ముఖ్యమంత్రి మాట్లాడినట్లు లేదు. రాజధాని నిర్మించాలని దేవుడు ఆదేశించినట్లయితే రాష్ట్ర విభజన కోరుకోవాలని కూడా (విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారుకదా) దేవుడు ఆదేశించాడా? రానున్న కాలంలో ప్రపంచంలోని ఐదు టాప్ నగరాల్లో అమరావతి కూడా ఉంటుందన్నారు.
ఆలూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతలా ఉంది బాబు చెప్పింది. నగర నిర్మాణమే ఇంకా ప్రారంభం కాలేదు. అది పూర్తి కావడానికి కొన్నేళ్లు పడుతుంది. ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచంలోని టాప్ నగరాల్లో ఒకటి కావాలనే ఊహ నిజం కావడానికి దశాబ్దాలు పడుతుంది. ఇదంతా పాలకుల పనితీరు, విధానాల మీద ఆధారపడి ఉంటుంది.
టాప్ నగరంగా మారేంతవరకు చంద్రబాబు అధికారంలో ఉండరు. కాని ఉండాలని ఆయన ఆశ. కేంద్రం న్యాయంగా చేయాల్సిన ఆర్థిక సాయం చేయకపోయినా, విభజననాటి రెవెన్యూ లోటు భర్తీ చేసేదిలేదని చెప్పినా గమ్మున ఉండిపోయిన ముఖ్యమంత్రి గొప్పలు చెప్పకోవడానికి వెనకాడటంలేదు. బాబు పాలనలో రాష్ట్రం పరిస్థితి పైన పటారం.. లోన లొటారంలా ఉందనుకోవచ్చా...!