'దంగల్‌' అలా సరిపెట్టుకోవాల్సిందే.!

'బాహుబలి' రాకపోయి వుంటే, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమాగా 'దంగల్‌' రికార్డులకెక్కేది. కానీ, 'బాహుబలి' రాకతో రికార్డులు గల్లంతయిపోయాయి. 'దంగల్‌' ఆశలు నీరుగారిపోయాయి. నిజానికి 'దంగల్‌' ఆషామాషీ సినిమా ఏమీ కాదు. 'బాహుబలి'తో పోల్చడం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, 'దంగల్‌' ఓ ప్రత్యేకమైన చిత్రం. ఆ సినిమాతో చాలా మంచి మెసేజ్‌ సొసైటీకి అందింది. 'బాహుబలి' కంటే తక్కువ బడ్జెట్‌ మాత్రమే కాదు, 'బాహుబలి'తో పోల్చితే తక్కువ టైమ్‌లోనే ఆ సినిమా తెరకెక్కింది. 'బాహుబలి' సినిమాలోలా అందులో గ్రాఫిక్స్‌ లేవు. 

అయినాసరే, లెక్కలు పక్కాగానే చెప్పుకోవాలి. 'దంగల్‌' లాంటి సినిమా అంతకు ముందు 'సుల్తాన్‌' రూపంలో వచ్చేసింది. రెండూ రెజ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలే. అయినప్పటికీ కూడా 'దంగల్‌' సాధించిన విజయం అసామాన్యం. 'దంగల్‌' వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఆషామాషీ విషయం కాదు. ఏం చేస్తాం, 'బాహుబలి ది కంక్లూజన్‌' దెబ్బకి, 'దంగల్‌' రెండో ప్లేస్‌కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 

'దంగల్‌' 1000 కోట్ల క్లబ్‌లోకి చేరేసరికి, 'బాహుబలి' ఏకంగా 1250 కోట్లు దాటేసింది. 'బాహుబలి' ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే వుంది. ప్రస్తుతానికి 'దంగల్‌' ఒక్క ఆస్ట్రేలియాలోనే నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో వుంది. అక్కడా నెంబర్‌ వన్‌ ఛెయిర్‌ని దక్కించుకోవడానికి 'బాహుబలి' ఉవ్విళ్ళూరుతోంది. అంటే, అక్కడా 'దంగల్‌' రెండో స్థానంలోకి పడిపోవడం దాదాపు ఖాయమేనేమో.!

Show comments