విశాఖలోని ఆర్‌కే బీచ్ 'ప్రత్యేక హోదా మౌన ప్రదర్శన'కి వేదిక కానుంది. 'ఆంధ్రప్రదేశ్ యువత' పేరుతో పెద్దయెత్తున ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు ప్రత్యేక హోదా మద్దతుదారులు. 'కామన్ డ్రెస్ కోడ్'తో వీరంతా విశాఖలోని పలు చోట్ల సిద్ధంగా వున్నారు. అదే సమయంలో, వీరిని రాత్రి నుంచీ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.
తమను ఇళ్ళల్లో, హోటళ్ళలో నిర్బంధించడం, అరెస్టులు చేయడానికి సంబంధించి అర్థరాత్రి నుంచీ 'ఆంధ్రప్రదేశ్ యువత' సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల్ని వుంచుతుండడం గమనార్హం. అయినాసరే, ప్రత్యేక హోదా మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆర్‌కే బీచ్ వైపు అడుగులేస్తున్నారు. మరోపక్క, సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు, విశాఖ చేరుకున్నానంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. 'నేను వెళుతున్నా, మీరు వస్తారా.?' అంటూ సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలకు సంపూర్ణేష్ సవాల్ విసిరిన విషయం విదితమే. ప్రత్యేక హోదా డిమాండ్ న్యాయబద్ధమైనదంటూ నినదించాడు సంపూర్ణేష్.
సందీప్ కిషన్, నాని, నితిన్, వరుణ్‌తేజ్, సాయిధరమ్.. ఇలా పలువురు యంగ్ హీరోలు, ప్రత్యేక హోదా మౌన ప్రదర్శనకు మద్దతిచ్చారు. అయితే వీరిలో ఎంతమంది నేడు విశాఖలో దర్శనమిస్తారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. సంపూర్ణేష్ మాత్రం విశాఖలో ఎంటర్ అయిపోయాడు. ఇకనేం, పోలీసులు ఎంచక్కా ఆయన్ని అరెస్ట్ చేసేయొచ్చు. ఎందుకంటే, ఆర్‌కే బీచ్‌లో ఎలాంటి ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెబుతున్నారు గనుక.
'అరెస్టులతో మా ఉద్యమాన్ని నీరుగార్చలేరు..' అంటూ బీచ్‌లో పోలీసు బందోబస్తుకి సంబంధించిన ఫొటోలతో సోషల్ మీడియాని ముంచెత్తేస్తోంది ఆంధ్రప్రదేశ్ యువత.