విశాఖలో రేపేం జరుగుతుంది?

సమైక్య ఆంధ్ర ఉద్యమం తరువాత కాస్తో కూస్తో మళ్లీ ఇన్నాళ్లకు ఆంధ్రుల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలింది. ఛలో విశాఖ అంటూ ఇటు జనసేన, అటు వైకాపా ఇచ్చిన పిలుపు సోషల్ నెట్ వర్క్ లో భయంకరంగా ప్రతిథ్వనిస్తోంది. మరి ఆ మేరకు విశాఖ ఆర్కేబీచ్ లో స్పందన వుంటుందా? వుండదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుంది. ఇలా అనుమానించడానికి రెండు కారణాలు. ఒకటి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి వ్యతిరేకం కావడం. అందువల్ల పోలీసులు సహజంగానే ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే అసలు కార్యక్రమం నిర్వహణకు ప్రయత్నం జరుగుతుందా? అన్నది చూడాలి. 

వైకాపా నేత జగన్ విశాఖ వెళ్తున్నారు కాబట్టి, ఆ పార్టీ శ్రేణులు కొంతవరకు ప్రయత్నిస్తాయి. అయితే జగన్ ను విమానాశ్రయంలోనే అడ్డుకోవమో, అరెస్టు చేయడమో జరగవచ్చు. అలాగే యువకులు ఉత్సాహవంతుల్లో కొందరయినా ముందుకు రావచ్చు. అయితే పోలీసులు, లాఠీ చార్జీలు ఇలాంటివి వుంటాయేమో? ఎందుకు వచ్చిన గొడవ అని ఎక్కువ మంది దూరంగా వుండే అవకాశమూ వుంది. 

ఇక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మూడు ట్వీట్ లు, ఆరు పోస్టింగ్ లు అన్నట్లు తన పని సాగిస్తున్నారు తప్ప, విశాఖ వెళ్తాను అన్నమాట మాత్రం ఎక్కడా మాట్లాడ లేదు. పైగా వెళ్లడం లేదన్న ఫీలర్లే ఎక్కువ వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన వెళ్తే వచ్చే స్పందన వేరు. మరి ఆయన వెళ్లకుండానే అలాంటి స్పందనను ఆయన ఆశిస్తున్నారు. అలాంటి స్పందనే కనుక కనిపించి, కార్యక్రమం కొంతయినా నడిస్తే, కచ్చితంగా ఇక పవన్ కళ్యాణ్ ఇదే తరహా ట్విట్టర్ కార్యాచరణనే నమ్ముకుంటారు. లేదూ, గజం మిధ్య, పలాయనం మిధ్య అన్న సామెతలా ఏ హడావుడి లేకపోతే ఇక పవన్ కూడా చల్లారిపోతారు.

అంతకన్నా పవన్ కూడా వెళ్లి విమానాశ్రయంలో వుండిపోవడమో, అరెస్టు కావడమో జరిగితే పరిస్థితి వేరుగా వుంటుంది. కానీ పవన్ ఆ ఆలోచనలో వున్నట్లు కనిపించడం లేదు. కేవలం యువతను మందుకు నెట్టి, ఆయన వెనుక వుండే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.

మొత్తం మీద విశాఖ కార్యక్రమం రెండు విషయాలను స్పష్టం చేస్తుంది. ఒకటి హోదాపై జనానికి వున్న ఆసక్తి. రెండు పవన్ కు ఉద్యమం పట్ల వున్న చిత్తశుద్ది. 

Show comments