వస్తుంది సరే... ప్రజలకేం చెప్పుకుంటుంది..?

తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి చాలాకాలం తరువాత నోరు విప్పింది. ఎందుకు? తన పైన జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి. తెలంగాణ వదిలేసి, తమిళనాడుకు వెళ్లిపోయి, అక్కడ అన్నాడీఎంకే (శశకళ)లో చేరుతుందని కొన్నాళ్లుగా మీడియాలో కథనాలొస్తున్నాయి. ఆమె ధోరణి కూడా ప్రచారాన్ని బలపరిచేదిగానే ఉంది.

రాములమ్ము తమిళనాడుకు వెళ్లిపోతుందని చాలా కాలంగా జోరుగా ప్రచారం జరిగినప్పటికీ పెదవి విప్పని ఈ మాజీ హీరోయిన్‌ అతి కష్టం మీద మౌనం వీడి చాలా ఆలస్యంగా స్పందించింది. తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని, తన రాజకీయ జీవితం ఈ రాష్ట్రంతోనే ముడిపడి ఉందని చెప్పింది. అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, త్వరలోనే పునరాగమనం చేస్తానని చెప్పింది.

మిగతా విషయాలు ఎలా ఉన్నా అనారోగ్యం ఎంతవరకు నిజమో చెప్పలేం. ఆమె అనారోగ్యంగా ఉన్నట్లు, ఆస్పత్రిలో చేరినట్లు వార్తలొచ్చిన దాఖలాలు లేవు. చిన్నాచితక అనారోగ్యాలు కలగడం సహజమే. కాని గత మూడేళ్లుగా బయటకు రానంత అనారోగ్యం ఏం కలిగిందో ఆమె చెబితేగాని తెలియదు.  కొంతకాలంగా చెన్నయ్‌లో చురుగ్గా  వ్యవహరిస్తున్న విజయశాంతి అనారోగ్యం పాలైందంటే ఎవ్వరూ నమ్మరు. అనారోగ్యం పాలై కోలుకుందేమో....!

త్వరలోనే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది విజయశాంతి. త్వరలో అంటే ఎన్నికల ముందని అర్థమా? మళ్లీ అసెంబ్లీకో, పార్లమెంటుకో పోటీ చేయాలి కదా. ఆమె పునరాగమనాన్ని కాంగ్రెసు నాయకులు స్వాగతిస్తారనే (ఒకవేళ కాంగ్రెసులోనే ఉంటే) అనుకోవచ్చు. ఆమె ఎప్పుడు గడప దాటి బయటకు వస్తుందా అని వారు ఎదురు చూస్తున్నారు. రాములమ్మ గత మూడేళ్లుగా పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నా నాయకులు ఏమీ అనలేదు. అధిష్టానమూ పట్టించుకోలేదు.

గత ఎన్నికల తరువాత పనిచేయని నాయకురాలికి మళ్లీ టిక్కెట్టు ఇస్తారా? కాంగ్రెసు నాయకులు ఇప్పటికీ విజయశాంతిని పెద్ద నాయకురాలిగానే పరిగణిస్తున్నారు. కాబట్టి టిక్కెట్టు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. యూపీ ఎన్నికల సమయంలో కాంగ్రెసుకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని మార్చి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను నియమించాలని చెప్పారని గతంలో ఓ కథనం వచ్చింది.

అప్పట్లో ఉత్తమ్‌ను మారుస్తారనే   ప్రచారం జరిగింది. అధ్యక్ష పదవి కోసం అజర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్‌ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అదే సమయంలో విజయశాంతి పేరు కూడా  పరిశీలించారట...! పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తి పేరు అధ్యక్ష పదవికి పరిశీలించారంటే టిక్కెట్టు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది? కాంగ్రెసు నాయకత్వం ఆమెకు ప్రాధాన్యం ఇచ్చినా విజయశాంతి ప్రజలకు ఏం చెప్పుకుంటుందనేది కీలక ప్రశ్న.

గత ఎన్నికల తరువాత తాను ఎందుకు అజ్ఞాతంలో ఉందో చెప్పాలి. కాంగ్రెసు నాయకులు బతిమాలినా ఏ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసమా? ప్రజా సేవ కోసమా? అనేది వివరించాలి. ఆమె టీఆర్‌ఎస్‌ ఉన్న కాలంలోనే జనానికి కనబడలేదని విమర్శలు వచ్చాయి. 'మా ఎంపీ కనబడటంలేదు' అని ప్రజలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పదవి ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా, గెలిచినా నిరంతరం ప్రజల్లో ఉండేవారే నాయకులుగాని విజయశాంతి మాదిరిగా బాధ్యతారహితంగా ఉండేవారు నాయకులు ఎలా అవుతారు? విజయశాంతి రాజకీయ వైభవం టీఆర్‌ఎస్‌తోనే పోయిందేమోననిపిస్తోంది.

ఆమె మళ్లీ చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చినా ప్రజాదరణ గతంలో మాదిరిగా ఉండేది అనుమానమే. తమిళనాడుకు వలస వెళుతోందన్న ప్రచారం ఎన్నికల సమయంలో ఆమెను వెంటాడొచ్చు. ఏది ఏమైనా ఆమె అజ్ఞాతం వీడి బయటకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడితేగాని ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది చెప్పలేం.

Show comments