రజనీకాంత్‌ 'కబాలి' - ది బ్రాండ్‌.!

రజనీకాంత్‌ అంటే వ్యక్తి కాదు, శక్తి. ఆయన పేరే ఒక బ్రాండ్‌. రజనీకాంత్‌ సినిమా వస్తోందంటే ఆ సినిమాపై అనూహ్యంగా అంచనాలు పెరిగిపోతుంటాయి. ఎంతలా.? అంటే అభివర్ణించడం కష్టం. సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనేవి తర్వాతి అంశాలు. ముందయితే, సినిమా రిలీజ్‌ అవుతుందనగానే అంచనాలు ఆకాశాన్నంటేస్తాయి. అంచనాలు మాత్రమే, రజనీకాంత్‌ బ్రాండ్‌ వాల్యూ కూడా ఆకాశాన్నంటేస్తుంటుంది. దటీజ్‌ రజనీకాంత్‌. 

ఏదన్నా సినిమా రజనీకాంత్‌ నుండి వస్తోందంటే చాలు, ఆయన పేరుతో పబ్లిసిటీ చేసుకోవాలనుకునే వ్యక్తులు, బ్రాండ్ల సంఖ్య పెరిగిపోతుంటుంది. 'కబాలి' విషయంలోనూ అదే జరుగుతోంది. 'కబాలి' విమానం, 'కబాలి' సిల్వర్‌ కాయిన్స్‌, 'కబాలి' కీ చెయిన్స్‌, 'కబాలి' ఫొటో ఫ్రేమ్స్‌.. ఒకటేమిటి.? ఈ వ్యాపారమే కోట్లలో సాగుతోందని ఓ అంచనా. 

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా 200 కోట్లు దాటేసిందని చిత్ర యూనిట్‌ మీడియాకి లీకులు అందిస్తోంది. 500 కోట్లు వసూలు సాధించడం ఖాయమన్నది చిత్ర యూనిట్‌ అంచనా. అయితే, రజనీకాంత్‌ గత చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ఫెయిలయ్యాయి. దానికి మించి, 'కబాలి' విడుదలపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే వుంది. ఈ నెల 22న సినిమా విడుదల.. అని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించేసినా, నిజమేనా.? అన్న అనుమానాలైతే అలాగే వున్నాయి. 

అన్నట్టు, తాజాగా 'కబాలి' చిత్రాన్ని రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య చూసేశారట. సినిమా అద్భుతః అంటున్నారామె. చూద్దాం.. రజనీకాంత్‌ ఓ బ్రాండ్‌.. కబాలీ ఓ బ్రాండ్‌లా మారిపోయిన ప్రస్తుత తరుణంలో రజనీకాంత్‌ తాజా చిత్రం 'కబాలి' బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సెన్సేషన్స్‌ క్రియేట్‌ చేస్తుందో.!

Show comments