చింత‌మ‌నేని ఎప్పటికీ ఇంతేనా?

ప్రస్తుతం  ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల‌పై అధికార పార్టీ నేత‌ల దాడులు స‌ర్వసాధార‌ణ విష‌యమే అయిన‌ప్పటికీ అధికార కావ‌రంతో కొంద‌రు రెచ్చిపోతున్న తీరు జ‌న‌సామాన్యాన్ని నివ్వెర‌ప‌రుస్తోంది. రౌడీ ఇజాన్ని స‌హించేది లేద‌ని ఒక‌ప‌క్క చంద్రబాబు బీరాలు పోతుంటే టీడీపీ నాయ‌కుల మాత్రం త‌మ నాయ‌కుడి మాట‌ల‌కు అర్థాలే వేరులే అనుకుంటూ త‌మ కండ కావ‌రాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మీద వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా ప్రద‌ర్శిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారి జాబితాలో దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇసుక మాఫియా ఆగ‌డాల‌ను అడ్డుకోబోయినందుకు మ‌హిళా అధికారి అని కూడా చూడ‌కుండా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిపై  కార్యక‌ర్తల చేత దాడి చేయించి రాష్ట్ర వ్యాప్తంగా చింత‌మ‌నేని గుర్తింపు తెచ్చుకున్న తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు పంచాయితీ నెరిపి చివ‌రికి బాధితురాలైన వ‌న‌జాక్షి చేత‌నే ఎమ్మెల్యేకు క్షమాప‌ణ చెప్పించ‌డంతో ఇక చింత‌మ‌నేని అరాచ‌కాల‌కు అడ్డూఆపూ లేకుండా పోతోంది. చీటికీ మాటికీ ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకుంటూ చింత‌మ‌నేని త‌న చ‌ప‌ల‌త్వాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఈ వ‌స్తాదు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ పై త‌న మ‌ల్లయుద్ద ప్రతిభా పాట‌వాల‌ను  మ‌రోసారి ప్రద‌ర్శించాడు. 

ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేసినందుకు, విధుల‌కు ఆటంకం క‌లిగించినందుకు ఇప్పటికే ఆయ‌న‌పై గంపెడు కేసులు ఉన్నాయి. కానీ వాట‌న్నింటినీ పూచిక‌పుల్లతో స‌మానంగా చూసే చింత‌మ‌నేని గ‌తంలో త‌న మాట విన‌డం లేద‌ని స్థానిక ఎస్సైని తాను పంచాయితీలు చేసే తోపులోకి పిలిపించి చేయి చేసుకున్నాడు. ఇదే విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల‌ల్లో ఆయ‌న‌గారు వీర గ‌ర్వంతో స్వయంగా చెప్పుకున్నారు. కొల్లేరు ఆక్రమ‌ణ‌ల విష‌యంలో ఏకంగా జిల్లా ఎస్పీపైనే నోరుపారేసుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చ‌ట్టాన్ని ర‌క్షించే పోలీసుల‌పైనే చింత‌మ‌నేని అధికార ద‌ర్పం ప్రద‌ర్శిస్తుంటే ఇక చిన్నా చిత‌క ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ‌రి చింత‌మ‌నేని అరాచ‌కాల‌కు సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ముగింపు ప‌ల‌క‌కుంటే జిల్లాలో ఉద్యోగం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యక‌ర్తల‌నే నియ‌మించుకోవాల్సి వ‌స్తుందేమో.

Show comments