మోడీ జమానా: కరువు లాభం.!

ఇది నరేంద్రమోడీ జమానా.. దేశంలో కరువొస్తే, దేశానికి లాభమొస్తుంది. ఒట్టు, ఇది నిజం. నమ్మరా.? అయితే, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని అడిగి చూడండి. దేశాన్ని పెద్ద పాత నోట్ల రద్దు అనే సునామీ ముంచెత్తింది. దెబ్బకి, జీడీపీ వృద్ధిరేటు అటకెక్కింది. అయినా, దేశం చాలా చాలా చాలా లాభపడింది. అదెలా.? అదే మరి, నరేంద్రమోడీ జమానా అంటే.! 

ఓ తెలుగు సినిమాలో, కామెడీ విలన్‌ ఒకడు.. కొబ్బరితోట కాలిపోతే లాభం లక్షల్లో వచ్చిందని లెక్కలు చెబుతాడు. అలా తయారయ్యింది వ్యవహారం. గత ఏడాది చివర్లో దేశం నెత్తిన పెద్ద పాత నోట్ల రద్దు అనే బాంబుని పేల్చారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆ దెబ్బకి దేశం ఇప్పటికీ కోలుకోలేదు. దాదాపు అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి పెద్ద పాత నోట్ల రద్దుతో. 

చిత్రంగా పెద్ద పాత నోట్ల రద్దుతో, పన్ను పరిధిలోకి కొత్తగా చాలామంది వచ్చారంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపరీతమైన కామెడీ చేసేశారు. దానికీ, దీనికీ లింకేంటి.? అనడక్కండి.. అడిగారో మీరుద దేశాభివృద్ధికి అడ్డుతగులుతున్నవారైపోతారు. అరుణ్‌ జైట్లీ మేధావి.. ఆర్థిక వేత్త. వెంకయ్యనాయుడు సీనియర్‌ పొలిటీషియన్‌.. ఈయనా మేధావే. అయినాగానీ, పెద్ద పాత నోట్ల రద్దుతో దేశానికి నష్టం కలగలేదు, లాభమొచ్చిందంటున్నారు. దీన్నే 'కరువు లాభం' అనాలేమో. 

కరువొస్తే లాభమేంటి.? అన్న డౌట్‌ మీకు రాకూడదంతే. కరువులోనే లాబాన్ని వెతుక్కోవాలి. ఆ లాభమేంటో మాత్రం, ఎప్పటికీ కన్పించదు. కానీ, వెతకాలి.. తప్పదు. పెద్ద పాత నోట్ల రద్దుతో నల్ల కుబేరులు విలవిల్లాడిపోతారని నరేంద్రమోడీ సర్కార్‌ సెలవిచ్చారు. కానీ, రోడ్డున పడ్డది సామాన్యుడే. దినసరి కూలీలు పెద్ద పాత నోట్ల రద్దు సమయంలో చితికిపోయారు. మధ్యతరగతి ప్రజానీకం వెతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నల్ల కుబేరుల్లో ఎవరికీ చీమకుట్టినట్లయినా అన్పించలేదు. 

దేశంలోని వివిధ రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు నెత్తీనోరూ బాదుకుంటోంటే, ఇప్పటికీ ఇంకా అవే మాయమాటలు. ఎవర్ని నమ్మించడానికి.? 

Show comments