స్పీకరూ భజన చేయాల్సిందేనా...!

'ఎంతవారలైన కాంత దాసులే'...అనే మాట మన దేశంలోని కొందరు నాయకురాళ్లకు బాగా సరిపోతుంది. వారు అంత పవర్‌ఫుల్‌ లీడర్లన్న మాట. ఎంతటి కొమ్ములు తిరిగిన పురుష పుంగవ నాయకులైనా ఆ నాయకురాళ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. వారికి భజన చేయాల్సిందే. చదువులో, రాజకీయ అనుభవంలో, విజ్ఞతలో, వయసులో ఎంత పెద్దవారైనా, సమాజంలో , రాజకీయాల్లో గండరగండులైనా ఆ నాయకురాళ్ల ముందు అజ్ఞానుల్లా వ్యవహరించాల్సిందే. తెలివి చూపిస్తే తుంగలో తొక్కి పారేస్తారు. 

గతంలో ఇందిరాగాంధీ శక్తిమంతురాలైన నాయకురాలిగా ఉండేవారు. ప్రధానిగా, కాంగ్రెసు పార్టీ అధినేత్రిగా ఆమె చెలాయించిన సర్వంసహాధికారం గురించి చాలామందికి తెలుసు. పాకిస్తాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసినప్పుడు రాజకీయంగా కాంగ్రెసుకు బద్ధశత్రువైన బీజేపీ నేత (ఒకప్పుడు జనసంఘ్‌) అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇందిరను అపర దుర్గాదేవిగా ప్రశంసించారట...! ఒకప్పుడు  ఇందిర వీరభక్తుల్లో ఒకడైన డీకే బారువా అనే నాయకుడు 'ఇండియాయే ఇందిర...ఇందిరాయే ఇండియా' అని పొగిడి భజనలో శిఖరాగ్రానికి చేరుకున్నాడు. 

ఇప్పుడున్న నాయకురాళ్లలో కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అత్యంత శక్తిమంతులుగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా పేరుపొంది, కాలం కలిసొచ్చి రెండుసార్లు ప్రధాని అయిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెసు అధినేత ముందు మరుగుజ్జుగా వ్యవహరించిన తీరు చూశాం. తెలంగాణ ఇచ్చిందన్న కృతజ్ఞతతో ఆ ప్రాంత కాంగ్రెసు నాయకుడొకరు ఆమెకు ఆలయం కూడా నిర్మించి తన భక్తిని చాటుకున్నారు. ఆమె మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానిస్తే (చనిపోయాక మృతదేహాన్ని ఢిల్లీలో కాంగ్రెసు కార్యాలయంలోకి తీసుకురానివ్వకుండా) అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ఒక్క కాంగ్రెసు నాయకుడూ నోరు మెదపలేదు. 

బెంగాల్లో మమతా బెనర్జీ కూడా నాయకులను వణికిస్తున్నారు. ఆమెకు ఎదురు మాట్లాడితే మటాషే. మాయావతి అధికారంలో ఉన్నప్పుడు 'ఆడింది పాటగా, పాడింది ఆటగా' వ్యవహరించారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడారుగాని ఆమె వచ్చి ఆయన్ని కలుసుకోలేదు.  ఆమెతో ప్రతిపక్ష నాయకుడు తగదా పెట్టుకున్నా, సొంత పార్టీ నాయకుడు ధిక్కరించినా బతుకు బస్టాండే. ఆమెను స్తోత్రపాఠం చేయని నాయకుడు సోదిలోకి లేకుండా పోతాడు. మొన్నటివరకు తమిళనాడు గవర్నరుగా పనిచేసిన రోశయ్య  జాగ్రత్తగా వ్యవహరించి అమ్మ కృపకు పాత్రుడయ్యారు. 

రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌, స్పీకర్‌ మొదలైనవారు స్వతంత్రంగా వ్యవహరించాలి. విధాన సభలో స్పీకర్‌, మండలిలో ఛైర్మన్‌ అధికార పార్టీ వారే అయినప్పటికీ అధికార, ప్రతిపక్షాలను సమంగా చూడాలి. సమన్వయంతో వ్యవహరించాలి. అధికార పక్షాన్ని వెనకేసుకొని రాకూడదు. సొంత పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకూడదు. పార్టీకి అనుకూలంగా ఎక్కడా మాట్లాడకూడదు. ఇదంతా థియరీ. కాని ఇది తమిళనాడులో నడవదు. ముఖ్యంగా అమ్మ పాలనలో. ఇక్కడ స్పీకర్‌ సైతం అమ్మ భజన చేస్తాడు. చాటుమాటుగా కాదు. అసెంబ్లీలోనే. అధికార పార్టీ సభ్యులతో ఆయనా కోరస్‌ పాడతాడు. 

తాజాగా అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ జయను అసెంబ్లీలో ప్రశంసలతో ముంచెత్తారు. ఎందుకు? తమిళనాడులో 'అమ్మ' బ్రాండు పథకాల గురించి తెలిసిందే. తాజాగా ఆమె మహిళలకు సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించారు. ఉద్యోగినులైన మహిళలకు ప్రసూతి సెలవు (మెటర్నటీ లీవ్‌) తొమ్మిది నెలలు ఇస్తున్నట్లు (జీతంతో) ప్రకటించారు. ఇది ఎన్నికల హామీ. ఒకప్పుడు మూడు నెలలుండేది. గతంలో జయలలితే ఆరు నెలలకు పెంచారు. ఇప్పుడు తొమ్మిది నెలలకు పొడిగించారు. ఈ నిర్ణయం ప్రకటించగానే అన్నాడీఎంకే సభ్యులు ఆనందంతో బల్లలు చరిచి, చప్పట్లు కొట్టి అమ్మను కీర్తించారు. గుప్తుల స్వర్ణయుగాన్ని మరపించిందన్నారు. 

ఈ సందట్లోనే స్పీకర్‌ ధనపాల్‌ పావుగంటసేపు అమ్మను 'స్తోత్రం' చేశారు. అమ్మ పాలన ముందు అశోకుడి పాలన సైతం బలాదూర్‌ అన్నారు. పైగా ఇద్దరి పరిపాలనను తాను అధ్యయనం చేశానని చెప్పారు. స్పీకర్‌ చర్యకు ప్రతిపక్ష డీఎంకే సభ్యులు ఆగ్రహించారు. ఇదేం విపరీతమని ప్రశ్నించారు. ఆయన ఇదేం పట్టించుకోలేదు. అమ్మను కీర్తించకపోతే పదవి ఊడుతుందని భయం. ఆయన ఈ పని చేయడం ఇదే తొలిసారి కాదు. దళితుడైన ధనపాల్‌ స్పీకర్‌ కావడం ఇది రెండోసారి. ఎంతో భయభక్తులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. 

Show comments