'వాళ్లకు కూడా మా గతే పడితే సరి'

అనగనగా.. ఇద్దరు మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ద్వేషం, వైరం! ఇద్దరూ ఒకే దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓసారి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాల్రా అని అడిగితే.. మొదటి ముని తెలివిగా.. రెండో మునీశ్వరుడు ఏం కోరుకుంటే తనకు అన్నీ రెట్టింపు కావాలని అడిగాడుట. దేవుడు రెండో మునీశ్వరుడి దగ్గరికెళ్లాడు. మొదటి రుషి ఏం కోరుకున్నాడో దేవుడి ద్వారా తెలుసుకున్న ఆ రెండో రుషి.. తనకు ఒక కన్ను, ఒక కాలు, ఒక చేయి తీసేయమని కోరాడుట. దీంతో మొదటి మునీశ్వరుడికి రెండు కళ్లూ, రెండు కాళ్లూ పోయాయి. ఇలా తనకు కొంత చేటు జరిగినా సరే.. తన ప్రత్యర్థి సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వారు.. తమ శక్తి యుక్తులను అందుకోసం వెచ్చించే వాళ్లు కొందరు ఉంటారు. 

ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే.. ఏపీసీసీ ప్రెసిడెంట్‌ రఘువీరారెడ్డి వైనం కూడా అలాగే కనిపిస్తోంది.  ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి జనం సమాది కట్టేవారు. ఆ పార్టీ అసలు ఉనికి లేకుండా పోయింది. తమకు పట్టిన గతే ఇతర పార్టీలకు కూడా పట్టాలని పీసీసీ ప్రెసిడెంట్‌గా రఘువీరారెడ్డి కోరుకుంటున్నట్లుగా ఉంది. తెలుగుదేశం, భాజపా రెండు పార్టీల గుర్తింపును కూడా రద్దు చేసేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. 

ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఈ రెండు పార్టీలు విఫలం అయ్యాయి గనుక.. వీటి పార్టీ గుర్తింపునే రద్దు చేసేయాలని ఆయన అంటున్నారు. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు లేఖ రాయడానికి కూడా రఘువీరా సిద్ధం అవుతున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించే విషయంలో ఇప్పటికే రఘువీరా రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ పలుమార్లు విఫలమైన సంగతి తెలిసిందే. 

విభజన నేపథ్యంలో రాష్ట్రం ఎంతగా నష్టపోతున్నప్పటికీ.. ఇక్కడ రాష్ట్రంలో బీరాలు పలకడం తప్ప.. తమ కేంద్ర నాయకత్వంలో కదలిక తీసుకువచ్చి ఆంధ్రకు న్యాయం జరిగేలా ఒక సమష్టీకృత ఉద్యమాన్ని నడిపించడంలో కాంగ్రెస్‌ ఫెయిలయిందనే చెప్పాలి. అలాంటి వైఫల్యాల వల్లనే 2014 ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత ఈ రెండున్నరేళ్లలో కనీసం తిరిగి నిలదొక్కుకోలేని స్థితిలో ఉంది. 

తమ పార్టీ ఎటూ పతనం అయిపోయింది గనుక.. ఇతర పార్టీలు కూడా పతనం అయిపోతే చాలునని.. రఘువీరా కోరుకుంటున్నట్లుంది. అందుకే తెలుగుదేశం, భాజపా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పాలన వైఫల్యాల గురించి ప్రజాపోరాటాన్ని నడపడం మానేసి.. ఇలాంటి కోరికలతో వారి పతనాన్ని అభిలషిస్తున్నారు.

Show comments