పొలిటికల్‌ విచిత్రం.. అవాక్కవుతున్న నంద్యాల జనం!

'భూమా నాగిరెడ్డి.. ఒక రౌడీ సార్‌.. ఇలాంటి రౌడీలు శాసనసభలో ఏంటి సార్‌.. నంద్యాల కౌన్సిల్‌ మీటింగ్‌లో భూమా రౌడీయిజం చేశాడు సార్‌.. బయట రౌడీయిజం చేస్తే చేయొచ్చు కానీ.. సభలో కూడా రౌడీయిజం చేస్తున్నాడు సార్‌..' ఇదీ కాలువ శ్రీనివాసులు ఏపీ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్య. అసెంబ్లీ రికార్డ్స్‌లో నమోదైన వ్యాఖ్య. మరి సభలో అలా మాట్లాడిన పెద్దమనిషి ఇప్పుడు నంద్యాల్లో భూమా నాగిరెడ్డి గొప్పదనం గురించి సందు సందు తిరిగి చెబుతున్నాడు. భూమా ఆశయ సాధన కోసం భూమా వారసులను గెలిపించాలని ఆయన నంద్యాల ప్రజలకు పిలుపునిస్తున్నాడు!

మరి స్వయంగా రౌడీ అని సంబోధించిన వ్యక్తి గురించి పాజిటివ్‌గా ప్రచారం చేసే పెద్దమనసు కాలువ శ్రీనివాసులకు ఉందేమో కానీ, అతి తక్కువ కాలంలో ఈ తేడాలను గమనిస్తున్న నంద్యాల ప్రజలకు మాత్రం విస్మయమే కలుగుతోంది.

'నా తండ్రికి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడే కారణం. దానికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుంది..' ఇది మీడియా ముఖంగా అఖిలప్రియ చెప్పిన మాట. ఒకసారి కాదు.. అనేక మార్లు ఆమె అలా మాట్లాడారు. తన తండ్రి అరోగ్యం ఏమీ బాగోలేదు, తల్లి చనిపోయాకా ఆయన పరిస్థితి ఏం బాగోలేదు.. అలాంటి ఆయనను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నాడు.. అని అఖిల అప్పట్లో తీవ్రంగా ఆవేదన భరితురాలైంది.

మరి ఇప్పుడూ.. 'చంద్రబాబు చాలా గొప్ప మనిషి. మా కుటుంబాన్ని ఆదుకున్నాడు, అండగా నిలిచాడు.. అందుకే జగన్‌కు బుద్ధి చెప్పండి..' అని ఆమె నంద్యాల ప్రజానీకానికి పిలుపునిస్తున్నారు. మరి తండ్రికి ఏమైనా అయితే దానికి కారణం చంద్రబాబే అని చెప్పిన ఆమె, ఇప్పుడు చంద్రబాబు తమను ఆదుకున్నాడు అని చెబుతుంటే.. నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉన్నారు నంద్యాల ప్రజలు.

ఇక మరోవైపు మంత్రివర్యులు.. ఆదినారాయణ రెడ్డి, అమరనాథ రెడ్డి లాంటి మహనీయులు. వీళ్లు నంద్యాల వీధివీధీ తిరిగి చెబుతున్నది ఏమిటంటే.. జగన్‌కు అధికార దాహం అని. పార్టీ ఫిరాయించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. మంత్రిపదవులు తీసుకున్న వీళ్లు, జగన్‌కు అధికార దాహం అని మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడేమాట అటుంచి, కచ్చితంగా పడే ఓట్లు కూడా దూరం అవుతాయేమో అనే అభిప్రాయం కలగమానదు.

ఇక ప్రతిపక్ష పార్టీ విషయంలో కూడా క్యాండిడేట్‌ను తెలుగుదేశం నుంచి తెచ్చుకోవడమే జరిగింది. అయితే శిల్ప మోహన్‌ రెడ్డి అప్పుడూ బడాయి మాటలు చెప్పలేదు, ఇప్పుడూ చెప్పలేదు. తెలుగుదేశంలో ఉన్నాను కదా అని చెప్పి.. అప్పట్లో శిల్పా మోహన్‌ రెడ్డి చెలరేగిపోలేదు. జగన్‌పై దుమ్మెత్తిపోయలేదు. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాను కదా అని చెప్పి.. చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలకూ దిగడంలేదు. ఆ మాత్రం పరిణతి చూపిస్తున్నాడు శిల్పామోహన్‌ రెడ్డి.

అయితే నంద్యాల బాధ్యతల్లో ఉన్న ఆరుమంది తెలుగుదేశం మంత్రులే.. మరీ కొత్త బిచ్చగాళ్ల తీరున చెలరేగిపోతున్నారు. జనాలు విస్తుపోయేలా చేస్తున్నారు.

Show comments