100 కోట్లు.. అంతకు మించి.!

'రాజకీయాల్లో డబ్బు పాత్రని తగ్గిస్తాం..' అంటూ ఎన్నికల కమిషన్‌ ప్రతిసారీ హడావిడి చేస్తూనే వుంటుంది. అధికారంలో వున్నవారూ, ప్రతిపక్షంలో వున్నవారూ, 'డబ్బుతో కూడిన రాజకీయాలపై' అసహనం వ్యక్తం చేయడం మామూలే. అదే సమయంలో, ఆ డబ్బుతోనే అన్ని రాజకీయ పార్టీలూ రాజకీయం చేయడమూ మామూలే. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, తమిళనాడులోని ఆర్‌కే నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ ఉప ఎన్నికలు తమిళనాడు చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ కనీ వినీ ఎరుగనంత 'కాస్ట్‌లీ'గా జరగబోతున్నాయని ఇప్పటికే సంకేతాలు వచ్చేశాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గమిది. ఇక్కడ అన్నాడీఎంకేలోని శశికళ వర్గం, పన్నీర్‌ సెల్వం మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇంకేముంది, పెద్దయెత్తున డబ్బు ఏరులై పారుతోందిక్కడ. 

సాక్షాత్తూ ఓ మంత్రిగారు ఇక్కడ సుమారు 100 కోట్లు ఖర్చుపెట్టేందుకు డబ్బుని 'బదిలీ' చేశారు. ఆయనపేరు విజయ్‌ భాస్కర్. ఈ నియోజకవర్గానికి అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం ఇన్‌ఛార్జ్‌ ఈయనగారే. అలా బదిలీ అయిన మొత్తాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల వేళ ఐటీ అధికారుల దాడులు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ని కలిసి మద్దతు పలికారు సినీ నటుడు శరత్‌కుమార్‌. దాంతో శరత్‌కుమార్‌పైనా ఐటీ దాడులు జరిగాయి. ఐటీ అధికారులు లెక్కలు తేల్చిన మొత్తం దాదాపు 100 కోట్లు.. మరి, లెక్కలు తేలనిదెంత.? అనడక్కండి, కళ్ళు బైర్లు కమ్మేస్తాయ్‌.

Show comments