'భరతుడు'గా మిగిలిపోయిన సాత్త్వికుడు...!

    తమిళనాడు 'భరతుడు' కమ్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒ.పన్నీరుశెల్వం సీఎం పదవి కోసం జరిగిన భీకర పోరాటంలో దారుణంగా ఓడిపోయారు. గణాంకాలే ప్రాతిపదికగా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థలో పన్నీరుశెల్వం వంటి మెత్తటివాడు, సాత్త్వికుడు నెగ్గుకురావడం కష్టం. పర్మినెంట్‌ సీఎం పోస్టు దక్కని పన్నీరుకు చివరకు ప్రజల సానుభూతి మాత్రమే మిగిలింది. 'అయ్యో పన్నీరుశెల్వం' అనుకొని నిట్టూర్పు విడిచే పరిస్థితి ఏర్పడింది. ఆయన పూర్తి కాలపు ముఖ్యమంత్రి కాలేకపోయినా, తాత్కాలికంగానే పీఠంపై ఉన్నప్పటికీ చివరకు ముఖ్యమంత్రిగానే పదవి నుంచి దిగిపోయారు. ఇది చెప్పుకోదగ్గ విశేషం. రాష్ట్రానికి ఆయన మూడుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండుసార్లు జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు. మూడోసారి ఆమె మరణించినప్పుడు. రెండుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రి అయిన తరువాత (ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యారో చాలామందికి తెలిసేవుంటుంది) జయలలిత మంత్రివర్గంలోనే మంత్రిగా చేశారు. అంటే ఆయన చివరి పోస్టింగ్‌ మంత్రి పదవి అన్నమాట.

     సాధారణంగా చివరి పదవి ఏదయితే ఆ పదవితోనే 'మాజీ' అవుతారు. అయితే మూడోసారి తాత్కాలిక సీఎంగా బాధ్యతలు నిర్వహించిన పన్నీరు శశికళ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికైన తరువాత తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాల్సివచ్చింది. చివరకు శశికళ వర్గం నేత పళనిసామికి గవర్నర్‌ అవకాశం ఇవ్వడంతో పన్నీరు శకం ముగిసింది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. శశికళ జైలుకు వెళుతూవెళుతూ అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. పన్నీరువర్గం నాయకులు ఈ బహిష్కరణ చెల్లదంటున్నారు. చిన్నమ్మ పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాలేదు. కేవలం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది. ఎన్నికల సంఘం కూడా ఆమె ఎన్నిక చెల్లదని చెప్పినట్లు వార్తలొచ్చాయి. కాబట్టి ఆయన పార్టీలో ఉంటారా? ఉండరా? అనేది తేలాల్సివుంది. ఇప్పుడాయన బీజేపీ గుప్పిట్లో ఉన్నాడని రాజకీయ పండితులు చెబుతున్నారు. కొత్త ముఖ్యమంత్రిని నియమించకుండా పది రోజులు హైడ్రామా నడిపింది కూడా పన్నీరు కోసమేనని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది బీజేపీయే. పన్నీరుకు గవర్నర్‌ పదవి ఇచ్చే అవకాశముందని, అది ఆంధ్రప్రదేశ్‌ కావొచ్చని ఓ సమాచారం. ప్రస్తుత ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను ఎంత తొందరగా మారిస్తే (తెలంగాణకు పరిమితం చేయాలని) అంత మంచిదని ఏపీలోని అధికార పార్టీ భావిస్తోంది. 

    పన్నీరుకు పదవి దక్కకపోయినా మంచివాడు, సాత్త్వికుడు అనే పేరు దక్కింది. రాజకీయ నాయకుడిగా సమర్థుడు కాకపోయినా పాలకుడిగా సమర్థుడేనని ఉన్నతాధికారుల అభిప్రాయం. ప్రజల్లోనూ పన్నీరు పట్ల అభిమానం ఉన్న విషయం స్పష్టంగా బయటపడింది. మీడియా కూడా సానుకూలంగా ఉంది. అధికార యంత్రాంగంలో, ప్రజల్లో, బీజేపీలో అభిమానం ఉన్న కారణంగానే శశికళ ఒత్తిడి వల్ల పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆ తరువాత తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాని ఎమ్మెల్యేల మద్దతు దక్కలేదు. పన్నీరు శెల్వంను తొలగించి చిన్నమ్మకు పగ్గాలు ఇవ్వాలని మంత్రులు ఆరాటపడిన సమయంలో సచివాలయంలోని అనేకమంది అధికారులు పన్నీరుశెల్వం గురించి సానుకూలంగా మాట్లాడారు. పన్నీరు  బొమ్మవంటి వాడని, ఎలా ఆడిస్తే అలా ఆడతాడని ఒక అభిప్రాయం ఉంది. కాని ఆయన సమర్థంగా పనిచేస్తున్నారని, గతంలోని 'వర్క్‌ కల్చర్‌'ను మారుస్తున్నారని అధికారులు ప్రశంసించారు. చెప్పుకోవల్సిన మరో విశేషమేమిటంటే చిన్నమ్మ భర్త నటరాజన్‌ పన్నీరుకు అనుకూలంగా మాట్లాడటం. ఆయన మంచిగా పనిచేస్తున్నారని, మార్చాల్సిన అవసరం లేదని అన్నాడు. కాని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందన్నాడు. తన భార్య శశికళకు పదవీ కాంక్ష లేదని చెప్పడానికి ఈ విధంగా మాట్లాడివుండొచ్చేమో...! పన్నీరు శెల్వం పరిపాలనలో సానుకూల దృక్పథంతో వ్యవహరించారని  అధికారులు చెప్పారు. ఆయన తనకు తాను నాయకుడిగా తీర్చిదిద్దుకుంటూ సచివాలయంలో గతంలో లేని వాతావరణాన్ని కల్పించారని అన్నారు.

     పని విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవారన్నారు. కరుణానిధి, జయలలిత ప్రభుత్వాల్లో పనిచేసిన ఒక ఉన్నతాధికారి పన్నీరు గురించి మాట్లాడుతూ ఆయన ప్రజలతో వ్యవహరించే తీరులో వినయం, దయ కలగలిసి ఉంటాయన్నారు. పన్నీరు ఫైల్స్‌ చాలా త్వరగా క్లియర్‌ చేశారని, గతంలో ఈ పరిస్థితి లేదని మరో అధికారి చెప్పాడు. పన్నీరు అందరితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు తీసుకునేవారని, ఇలాంటి పరిస్థితి గతంలో తామెన్నడూ చూడలేదని మరో అధికారి తెలియచేశాడు.  అంటే జయలలిత పనితీరుకు, ఈయన పనితీరుకు చాలా తేడా ఉందని అర్థమవుతోంది. జయలలిత నియంతలా వ్యవహరించేవారని, ఈయన ప్రజాస్వామికంగా వ్యవహరించారని భావించాలి.  పన్నీరుశెల్వం పనికిమాలినవాడేమీ కాదు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్నవాడు. మున్సిపల్‌ 

ఛైర్మన్‌గా ప్రయాణం ప్రారంభించిన ఆయన మంత్రిగానే కాకుండా జయలలిత ఇబ్బందుల్లో పడినప్పుడు తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆయనకు ప్రజలతో, అధికారులతో ఎలా వ్యవహరించాలో తెలుసు. 'అమ్మ'కు పరమ విధేయుడైన ఈయనలో సమర్థత కూడా ఉందని అధికారులు గుర్తించారు. 

    ఇక పన్నీరు బీజేపీ మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అభిమానం కూడా సంపాదించారు.  జయలలిత మరణించినప్పటినుంచి పన్నీరుకు కేంద్రం, బీజేపీ  సహకారం అందించాయి. ఈయన కూడా  అదే వైఖరి అవలంబించారు. ఇందుకు నిదర్శనం రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సంతోషంగా ఉంటూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం. జయలలిత హయాంలో సంఘ్‌ అణచివేతకు గురైంది. డీఎంకే పాలనలోనూ ఇదే పని జరిగినా 'అమ్మ' మరింత కఠినంగా వ్యవహరించారు. మోదీ ప్రధాని అయ్యాక జయకు ఆయనతోనూ, కేంద్రంలోని బీజేపీ నేతలతోనూ మంచి సంబంధాలే ఏర్పడ్డాయి. ఆమె ఢిల్లీ చుట్టూ తిరగకుండానే నిధులు రాబట్టుకున్నారు. కావల్సిన పనులు చేయించుకున్నారు. అయినప్పటికీ ఆర్‌ఎస్సెస్‌ను ఆమడ దూరంలో ఉంచారు.  బీజేపీ నాయకులు గమ్మునుండటం తప్ప ఏం చేయలేకపోయారు. జయ మరణించగానే ఆర్‌ఎస్సెస్‌ ఊపిరి పీల్చుకుంది.

     సంఘ్‌ కార్యకలాపాలన్నీ స్వేచ్ఛగా జరుగుతున్నాయి. జయలలిత హయాంలో సంఘ్‌ ఏ పని తలపెట్టినా అనుమతి ఇవ్వకపోయేవారు. రోజువారీ కార్యకలాపాల మీద కూడా ఆంక్షలుండేవి. డీఎంకే పాలనలోనూ పోలీసులు అనుమతి ఇవ్వకపోయేవారు. కాని సంఘ్‌ నాయకులు కరుణానిధిని, ఇతర డీఎంకే నాయకులను కలిసి ఏదోవిధంగా అనుమతి తెచ్చుకునేవారు. జయ పాలనలో ఈ లాబీయింగ్‌ పనిచేయలేదు. రామాయణంలో భరతుడి పాత్ర అందరికీ తెలిసిందే. రాముడి స్థానంలో భరతుడిని అయోధ్యకు రాజుని చేయాలని అతని తల్లి కైకేయి ప్రయత్నించగా, ఆమెను అసహ్యించుకున్న భరతుడు రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు ఆయన పాదుకలను సింహాసనం మీద పెట్టి రాజ్య పాలన చేశాడు. అప్పటి రాజవంశ సంప్రదాయాల ప్రకారం రాముడే అసలు రాజు కాబట్టి తనను తాను రాజుగా భావించుకోకుండా రాముడి పేరుతోనే రాజ్యం చేశాడు. 'విధేయత'కు భరతుడిని తిరుగులేని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ భరతుడే మళ్లీ పుట్టాడు. ఆయనే  ఓ. పన్నీర్‌శెల్వం. మూడుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. 

-మేనా

Show comments