రెడ్డి గారికి తలంటిన చంద్రబాబు..?!

ఘనత వహించిన తెలుగు మీడియాకు.. ఢిల్లీలో డెంగీ బాధితులపై ఉన్నంత కరుణ.. రాయలసీమలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల జ్వరాల పాట్లపై లేకుండా పోయింది. సీమ జిల్లాల్లో డెంగీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి పిల్లలపై ఈ విషజ్వరం ప్రతాపం చూపుతోంది. ఇలాంటి బాధితుల్లో తమ పిల్లను ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకునే శక్తి  ఉన్నవారి సంగతిని పక్కన పెడితే.. ప్రభుత్వాసు పత్రుల్లోకి వెళ్లిన వారి దుస్థితే దుర్భరంగా మారింది.

ప్రభుత్వాసుత్రుల్లో డెంగీతో అడ్మిట్ అయిన కేసులకు కనీసం మంచాలు కూడా లేవు... ఒక్కో మంచం మీద ముగ్గురు పిల్లలను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు! ఆ మాత్రం చోటు దక్కని వారిని నేల మీద పడేస్తున్నారు. ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభుత్వాసుపత్రుల్లోని పరిస్థితులు. ఒకవైపు విషజ్వరాల విజంభణ.. మరోవైపు సరైన వైద్య సౌకర్యాలు లేవు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే.. ‘‘దోమలపై యుద్ధం’’ అంటూ పత్రికలకు యాడ్స్ ఇస్తోంది!

దోమలపై యుద్ధం ప్రకటించాడట చంద్రన్న! ఎక్కడా రోడ్లపై చెత్తాచెదారం లేదట! అంతా క్లీన్ చేసేశారట.. ఇక జనాలు తీసుకోవాల్సిన చర్యలేనట మిగిలినది. మరి ‘‘ఆయన ఉంటే.. వాడెవడితోనో పనేంటి’’ అన్నట్టుగా... నిజంగా రోడ్లపై స్వచ్ఛతే ఉండుంటే.. విష జ్వరాల వరకూ పరిస్థితి ఎందుకు వస్తుంది? రోడ్లు ఏ మేరకు క్లీన్‌గా ఉన్నాయో పత్రికల్లో యాడ్స్ ఇస్తే కానీ జనాలకు తెలియదా?

ఈ విధంగా యాడ్స్ ఇచ్చేసి.. దోమలపై యుద్ధంలో గెలిచేశామని ప్రభుత్వం ప్రకటించుకుంటుంటే.. ఈ వేడిలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేసిన ఒక ప్రకటన చంద్రన్నకు కోపం తెప్పించిందని సమాచారం. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. డెంగీ విపరీతంగా ప్రబలిన నేపథ్యంలో ‘‘హెల్త్ ఎమర్జెన్సీ’’ ప్రకటిస్తున్నాం అన్నాడు! Readmore!

మరి ఆ పదానికి అర్థం సామాన్య జనాలకు అయితే తెలీదు. ఎందుకంటే... విష జ్వరాల విజంభణ కొనసాగుతోంది. సరైన వైద్య సౌకర్యాలు లేవు. ఇక హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి, ప్రకటించకపోడానికి తేడా ఎలా తెలుస్తుంది? కానీ.. ఈ పదం వాడే సరికి సీఎం చంద్రబాబుకు మాత్రం చాలా కోపం వచ్చిందట!

సొంతజిల్లా కేంద్రంలో పల్లె ‘‘హెల్త్ ఎమర్జెన్సీ’’ అనే ప్రకటన చేయగానే.. వెంటనే మంత్రికి ఫోన్ చేసి.. ‘‘ఏం మాట్లాడుతున్నావ్..’’ అంటూ తలంటినట్టుగా వార్తలు వస్తున్నాయి. పరిస్థితి బాగోలేకపోయినా.. వేలమంది డెంగీతో బాధపడుతున్నా.. ‘‘డెంగీని జయించాం...’’, ‘‘దోమలపై పోరులో చంద్రన్నదే విజయం’’, ‘‘చంద్రబాబు అభినవ ఆలౌట్.. దోమలు మటాష్’’ అనే ప్రకటనలు చేయాలి కానీ, ఇలా ‘‘పరిస్థితి బాగోలేదు... డెంగీ తీవ్రత ఎక్కువగా ఉంది.. హెల్త్ ఎమర్జెన్సీ’’ అంటూ మాట్లాడటం ఏమిటి?

తుఫానుపై విజయం సాధించి, కరువును తరిమి కొట్టిన బాబుకు దోమలు ఒక లెక్కనా? కాబట్టి.. వాస్తవాలతో సంబంధం లేకుండా ‘‘దోమలపై విజయం’’ ప్రకటనే చేయాలి.. అనే తత్వం బోధపడింది పల్లెకు. అందుకే ఆయన రెండో రోజు ..’’ అబ్బే.. హెల్త్ ఎమర్జెన్సీ.. లేదు, ఏమీలేదు.. అంతా ఉత్తిదే, పరిస్థితి అంతా కంట్రోల్‌లోనే ఉంది.. ఎక్కడా దోమల్లేవు.. మరెక్కడా పేషెంట్లూ లేరు.. అంతా క్లియర్’’ అన్నట్టుగా గొంతు సవరించుకోవాల్సి వచ్చింది!

మంత్రిగారు చేసిన హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన డ్యామేజ్ కవరేజ్ ఆ తర్వాత చాలానే జరిగింది. దోమలపై సాధించిన విజయం అంటూ.. పేపర్ యాడ్స్ ఇచ్చింది కూడా ఈ డ్యామేజ్ కంట్రోల్‌లో భాగమే అని సమాచారం. అయినా.. ప్రజలు ఎలా పోతేం ఏం, వైద్యం ఉంటేనేం లేకపోతేనేం.. దోమలపై అయినా, ఈగల మీద అయినా.. చంద్రన్న గెలిచాడంతే!

Show comments

Related Stories :