రెండు రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్) గెలిచింది.. మూడు రాష్ట్రాల్లో (పంజాబ్, గోవా, మణిపూర్) ఓడింది.. అయితేనేం, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది భారతీయ జనతా పార్టీ. మూడు రాష్ట్రాల్లో గెలిచినా, అధికారం విషయంలో ఒక్క రాష్ట్రంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది .కాంగ్రెస్ పార్టీ. అదే మరి చిత్రమైన విషయం. బీజేపీ, ఈ విషయంలో చాలా అతి తెలివి ప్రదర్శించిందన్నది నిర్వివాదాంశం. రెండో స్థానంలో నిలిచినాసరే, గోవాతోపాటు మణిపూర్‌లోనూ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులేసింది బీజేపీ.
మూడు రాష్ట్రాల్లో (పంజాబ్, గోవా, మణిపూర్) గెలిచిన కాంగ్రెస్, రెండు రాష్ట్రాల్లో (గోవా, మణిపూర్) మెజార్టీ దక్కకపోవడంతో నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇండిపెండెంట్లను తమవైపుకు తిప్పుకోవడంలో అలసత్వం ప్రదర్శించింది. దాంతో, మూడు స్థానాలో గెలిచినా.. ఒక్క చోటే గెలుపు తాలూకు ఫలాలు ఆ పార్టీకి అందే పరిస్థితి. గోవా, మణిపూర్‌లలో 'ఆధిక్యం మాదే..' అంటూ చెప్పుకోడానికి మినహా, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని దుస్థితి కాంగ్రెస్‌ది.
'గోవా, మణిపూర్‌లలో ఓటర్ల తీర్పుని బీజేపీ అవమానించింది.. నికృష్ట రాజకీయాలు నడుపుతోంది..' అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గుస్సా అవుతున్నా, జరగాల్సిన నష్టం ఆ పార్టీకి ఇప్పటికే జరిగిపోయింది. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా గవర్నర్‌ని బీజేపీ కలవడం, బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రేపు సాయత్రం గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసేశారు.
మరోపక్క, మణిపూర్‌లో 'మాకే అధిక్యం వుంది.. మమ్మల్నే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి..' అంటూ సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్, గవర్నర్‌ని కోరారు. అయితే, అంతకుముందే బీజేపీ, గవర్నర్ వద్ద తన బలాన్ని చాటుకోవడంతో.. ఇబోబీ సింగ్ పప్పులుడకలేదు. 'ముందు రాజీనామా చేయండి..' అంటూ గవర్నర్, ఇబోబీ సింగ్‌కి తేల్చిచెప్పారట.
ఇదిలా వుంటే, గోవా - మణిపూర్‌లలో అవకాశం వచ్చినట్లే చేజారిపోవడంపై అక్కడి కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ అధిష్టానమే కారణమన్నది వారి వాదన. మొత్తమ్మీద, కాంగ్రెస్ పార్టీ తన చేతగానితనంతో.. గెలిచిన మూడు రాష్ట్రాల్లో రెండింటిని కోల్పోవడం హాస్యాస్పదమే.!