అధినేతను మించిపోయిన తెలంగాణ తమ్ముడు...!

ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు వచ్చి పైస్థానాలకు వెళుతుంటారు. ఆయా ఉద్యోగాలకు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఎదుగుతుంటారు. కాని రాజకీయాల్లో ఎదగడానికి ఏ నిబంధనలూ ఉండవూ. డిపార్ట్‌మెంటల్‌ టెస్టులూ ఉండవూ. ఎవరు చురుగ్గా ఉంటారో, ఎవరు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారో, ఎవరు ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరిస్తారో, ఎవరు వాగ్ధాటి చూపించగలరో... అలాంటివారు పార్టీలో నాయకులుగా ఎదుగుతుంటారు. 

రాజకీయాల్లో సీనియారిటీ పనిచేయదు. సీనియర్‌ నేతలు ఏళ్ల తరబడి ఉన్నచోటనే ఉండొచ్చు. నిన్నా మొన్నా పార్టీలో చేరినవారు అమాంతం ఎదిగిపోవచ్చు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా రాణిస్తారో చెప్పలేం. తెలంగాణ టీడీపీలో చాలామంది కంటే 'ఫైర్‌బ్రాండ్‌' ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి జూనియర్‌. కాని ఇప్పుడు ఆయన అధినేత చంద్రబాబునే మించిపోయారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్‌ రెడ్డి అంటున్నారు. తెలంగాణ టీడీపీ అంటే రేవంత్‌ పార్టీ అనేవిధంగా తయారైంది. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు చేరినవారిలో (ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయిన తరువాత) మిగిలిపోయిన కొద్దిమంది ప్రస్తుతం గమ్మున ఉన్నారు.

తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు ఎల్‌.రమణ అయినప్పటికీ ఆ విషయం ఎక్కువమందికి తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్‌ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొంటున్న (ఓటుకు నోటు కేసు ఉన్నప్పటికీ) ఏకైక నాయకుడు రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ తరువాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతవున్న నాయకుడు  ఈయనేనని ఈమధ్య ఓ సర్వే తెలియచేసింది. పార్టీలో ఈ యువ నాయకుడి దూకుడు తట్టుకోలేక, అతనికి పెరగుతున్న ఆదరణను సహించలేక కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారు.

ఇప్పుడున్న చాలామంది సీనియర్లకు రేవంత్‌ అంటే పడదు. కాని ఏమీ అనలేక గమ్మున ఉన్నారు. రేవంత్‌ ముందుకొస్తే తప్ప తెలంగాణలో పచ్చ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు చేసే పరిస్థితి లేదు. దేనికైనా అతను లీడ్‌ తీసుకుంటే తప్ప ఇతర నాయకులు కదలడంలేదు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవం. ఆ వీడియో చేసిన ఎవరికైనా తెలిసిపోతుంది. అయినప్పటికీ కేసీఆర్‌పై ఎదురు దాడి చేశారు. సవాళ్లు విసిరారు. నడిబజార్లో వీరంగం వేశారు. ఈ కేసులో కొన్నాళ్లు జైలుకెళ్లిన రేవంత్‌కు బయటకు రాగానే అపూర్వ స్వాగతం లభించింది. జైలుకు వెళ్లి వచ్చాక చాలా పెద్ద నాయకుడైపోయారు.

తెలంగాణలో టీడీపీ ఏం చేయాలో, ఎలా వ్యవహరించాలో రేవంతే నిర్ణయిస్తున్నారు. మీడియా కూడా ఆయనతోనే మాట్లాడుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పోటీ చేస్తామని, అవసరమైతే కమ్యూనిస్టులనూ కలుపుకుంటామని ఆయన ఈమధ్య అంటే మహానాడుకు ముందు ప్రకటించారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరహాలో చెప్పారు. పొత్తులపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలూ లేవని, దానిపై ఎవ్వరూ మాట్లాడవద్దని అధినేత చంద్రబాబు చెప్పినప్పటికీ రేవంత్‌ తన దార్లో తాను వెళుతున్నారు.

ఆయన ఎలా వ్యవహరిస్తున్నా, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా, అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నా చంద్రబాబు ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయిన తరువాత ముగ్గురు మిగిలారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉనికి నిలిచివుందంటే అందుకు కారణం రేవంత్‌. ఈయన కూడా పార్టీని వదిలి వెళ్లిపోతారని, బీజేపీలోనో, కాంగ్రెసులోనో చేరతారని అనేకసార్లు ఊహాగానాలు హల్‌చల్‌ చేశాయి.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పోటీ చేస్తామని రేవంత్‌ ప్రకటించడం, అందుకు కాంగ్రెసు నాయకుడు జైపాల్‌ రెడ్డి సానుకూలంగా స్పందించి టీడీపీ తమకు శత్రువు కాదని చెప్పడం రెండు పార్టీల్లోనూ కలకలం సృష్టించింది. నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్లెవరు? అంటూ రెండు పార్టీల్లోని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీలోని సీనియర్లు రేవంత్‌ దూకుడును తట్టుకోలేక లేదా జీర్ణించుకోలేక మహానాడులోనూ పరోక్షంగా విమర్శలు చేశారు.

ఇలాంటివారిలో దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. తెలంగాణ టీడీపీకీ నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. ఆయనకు గవర్నర్‌ పదవి రాకపోవడంతో తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. దానికితోడు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేదు. అధ్యక్షుడు రమణ పరిస్థితి కూడా ఇదే. కాని తెలంగాణను వదిలేసిన చంద్రబాబు సీనియర్ల ఆవేదన విని ఊరుకోవడం తప్ప చేసేదేం లేదు. ఏదైనా కారణం వల్ల ఆయన రేవంత్‌ను వదులుకుంటే టీడీపీ చిరునామా పూర్తిగా గల్లంతయ్యే ప్రమాదముంది.

Show comments