కేసీఆర్‌కి ముహూర్తం అడ్డొచ్చింది

విపక్షాల్ని విమర్శించడానికి కూడా రాజకీయాల్లో ముహూర్తం చూసుకుంటారా.? ఓ నోట, 'అవాకులు చెవాకులు పేలుతున్నారు..' అనేస్తూనే, విపక్షాలకు సమాధానం చెప్పడానికి సమయం వేరే వుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, విజయదశమినాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్యను 31కి పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, కొత్త జిల్లా సిద్ధిపేట ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. 30 ఏళ్ళ క్రితమే ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుని కలిసి, సిద్దిపేట జిల్లా కోసం వినతి పత్రం ఇచ్చినట్లు కేసీఆర్‌ చెప్పుకున్నారు. ఈ రోజు ఆనాటి తన కోరిక నెరవేరినందుకు ఆనందంగా వుందన్నారు కేసీఆర్‌. 

ఇక, తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై విపక్షాలు యధాతథంగా విమర్శలు గుప్పిస్తూనే వున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక రాజకీయ దురుద్దేశ్యాలు వున్నాయన్నది విపక్షాల ఆరోపణ. కొత్త జిల్లాలకు తాము వ్యతిరేకం కాదనీ, అయితే ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అహంకారపూరిత ధోరణినే తాము ప్రశ్నిస్తున్నామని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. క్కడే, కేసీఆర్‌కి ఒళ్ళు మండిపోతోంది. 

విపక్షాలు ఎలాగూ అడ్డుకుంటాయి గనుక, జిల్లాల ఏర్పాటు విషయంలో మొదటి నుంచీ ఓ పక్కా వ్యూహంతో కేసీఆర్‌ వ్యవహరించారు. ఎవరూ ఏ కోణంలోనూ అడ్డుకోకుండా వుండేందుకుగాను, తెరవెనుక వ్యవహారం చక్కబెట్టాక మాత్రమే, అధికారిక ప్రకటన వెల్లడయ్యింది. వాస్తవానికి, అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే జరిగి, ఆ సమావేశాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరిగి వుండాల్సింది. కొత్త తలనొప్పి ఎందుకనుకున్నారో ఏమో, వ్యూహాత్మకంగా అసెంబ్లీ సమావేశాల్ని కేసీఆర్‌ పక్కన పెట్టారు. 

మొత్తమ్మీద, విజయదశమి రోజు తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లాల కారణంగా పండుగ వాతావరణమైతే నెలకొంది. ఈ పండుగ వాతావరణంలో రాజకీయ విమర్శలు చేయనంటూనే, తన ట్రేడ్‌ మార్క్‌ డైలాగులైన 'అవాకులు చెవాకులు..' అంటూ విపక్షాలపై దుమ్మెత్తిపోశారు కేసీఆర్‌. మరి, ముహూర్తం చూసుకుని విపక్షాలపై కేసీఆర్‌ విమర్శలు చేస్తే.. అబ్బో, ఆ కిక్కే వేరప్పా.

Show comments