జయ పోయింది...'శశి' ఊపిరి పీల్చుకుంది...!

ఓ వ్యక్తి మరణం కొందరికి బాధ కలిగిస్తే, ఇంకొందరికి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకు ఎవరి కారణాలు వారికుంటాయి. ఇది రాజకీయ నాయకులకూ వర్తిస్తుంది. ఎవరైనా రాజకీయ నాయకుడో, నాయకురాలో చనిపోయినప్పుడు పీడా విరగడైందని అనుకునేవారుంటారు. బతికుంటే తమకు మేలు జరిగేదని అనుకునేవారుంటారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎంపీ (రాజ్యసభ) శశికళ పుష్ప తనకు రిలీఫ్‌ దొరికినట్లు ఫీలవుతోంది. అవడమేంటి? నిజంగానే దొరికింది.

జయలలిత మరణించడం, ఆమె ప్రియ సఖి శశికళ నటరాజన్‌ జైలుకు వెళ్లడంతో ఆమెకు స్వేచ్ఛ లభించింది. శశికళ అధికారంలోకి వచ్చినా ఆమెకు కష్టాలు తప్పకపోయేవి. ఇంతకూ ఎంపీకి దేన్నుంచి విముక్తి లభించింది? లైంగిక వేధింపుల కేసు నుంచి. ఇది 'పెట్టుడు కేసు'గా తేలిపోయింది. వాస్తవానికి శశికళ పుష్ప 'అమ్మ' భక్తురాలు. అలా కాకపోతే రాజ్యసభకు వెళుతుందా? ఆ భక్తి ముదిరిపోయి జయలలిత ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది. ఇక అప్పటినుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. 

ఇంతకూ ఏం జరిగిందంటే... 'అమ్మ' జయలలిత మెప్పు కోసం ఎంపీ శశికళ పుష్ప ఓవరాక్షన్‌ చేసి శిక్షకు గురైంది. తమిళ సినిమాల్లో, అక్కడి రాజకీయాల్లో ఓవరాక్షన్‌ సాధారణం. ద్రవిడ పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో నాయకులంతా మహాభక్తిపరులు. ఈ భక్తి దేవుడి మీద కాదు. అధినేతల మీద. అందులోనూ అన్నాడీఎంకేలో అధినేత పట్ల భక్తిప్రపత్తులు పతాకస్థాయిలో ఉంటాయనే సంగతి తెలిసిందే. ఓసారి శశికళ పుష్ప డీఎంకేకు చెందిన రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివను లాగి చెంప మీద కొట్టింది. అది కూడా చాటుమాటుగా కాదు. పబ్లిగ్గా ఢిల్లీ విమానాశ్రయంలో గూబ గుయ్యిమనిపించింది. పైగా తన చర్యను సమర్ధించుకుంది. 

అందుకు ఆమె చెప్పిన కారణం...డీఎంకే ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర జయలలిత గురించి, అన్నాడీఎంకే గురించి హేళనగా మాట్లాడాడు. ఈమెను చూసి మరింత రెచ్చిపోయాడు. అమ్మను, పార్టీని మాటలనడం ఈమె తట్టుకోలేకపోయింది. చెంప పగలగొట్టింది.  ఒకప్పుడు వీరిద్దరు స్నేహితులుగా ఉండేవారు. మహిళా ఎంపీ పురుష ఎంపీని ఏ ఉద్దేశంతో కొట్టిందోగాని  అమ్మ మాత్రం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించింది. మహిళా ఎంపీ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని జయలలిత ఫీలయ్యారు.

తనపై దుష్ప్రచారం చేయడానికి డీఎంకేకు ఆయుధంగా ఉపయోగపడుతుందని భావించారు. దీంతో ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించారు. శశికళ అమ్మ కాళ్లపై పడితే క్షమించేదేమో. కాని ఆ పని చేయలేదు. పైగా పార్లమెంటులోనే జయలలితపై ఆరోపణలు, విమర్శలు చేసింది. ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరింది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన జయలలిత ఆమె ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళల చేత ఎంపీ, ఆమె భర్త, కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు వేయించారు.

ఎంపీతోపాటు మిగతా కుటుంబ సభ్యులు తమను లైంగికంగా వేధించారని భానుమతి, ఝాన్సీరాణి అనే పనివారు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఆమె కుటుంబానికి చిక్కులు చీకాకులు మొదలయ్యాయి. ఇది కాకుండా చీటింగ్‌ కేసు కూడా నమోదైంది. వాస్తవానికి ఈ పని జయలలిత చేయించారో, స్నేహితురాలు శశికళ నటరాజన్‌ చేయించిందో తెలియదు.

జయలలిత చనిపోగానే  ఇద్దరు శశికళల మధ్య పోరాటం మొదలైంది.  జయలలిత చనిపోగానే తానే సర్వంసహాధికారిని అన్నట్లుగా శశికళ మాట్లాడగానే జయలలిత  మరణానికి ఆమె కారణమంటూ శశికళ పుష్ప తెర మీదికి వచ్చింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేసింది. చివరకు చిన్నమ్మ బెంగళూరు జైలుకు వెళ్లడంతో ఎంపీ కష్టాలు తొలగాయి. ఆమె ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు ఎంపీ కుటుంబంపై పెట్టిన లైంగిక వేధింపుల కేసు ఉపసంహరించుకున్నారు. ఇది నిజమైన కేసు అయివుంటే ఈ పని చేసేవారు కాదు కదా. 

Show comments