ఎర్రబెల్లికి జ్ఞానోదయమయ్యిందా.?

తెలుగుదేశం పార్టీని నిండా ముంచేసి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఇదిప్పటి మాట కాదు, కొన్నాళ్ళ క్రితమే జరిగింది. టీడీపీలో వున్నప్పుడయితే, తెలంగాణకు సంబంధించినంతవరకు ఆయనే సుప్రీం. ఆ స్థాయిలో ఎర్రబెల్లి హవా నడిచింది కొన్నాళ్ళపాటు. తనతోపాటు కొందర్ని టీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్ళిపోతే, తనకు మంత్రి పదవి దక్కుతుందని ఎర్రబెల్లి ఆశించారు. బోల్డంత గౌరవం కేసీఆర్‌ నుంచి పొందొచ్చనుకున్నారు. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా పావులు కదిపి టీడీపీని ముంచేశారు. 

కానీ, ఇప్పుడేం జరిగింది.? ఎర్రబెల్లికి తత్వం ఇప్పుడిప్పుడే బోధపడ్తోంది. టీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యత ఏమాత్రం దక్కడంలేదని అర్థం చేసుకున్నారాయన. తిరిగి టీడీపీలోకి వెళితే ఎలా వుంటుంది.? అని ఆలోచిస్తూ చిస్తూ.. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణతో భేటీ అయ్యారు. అంతే, ఎర్రబెల్లి టీడీపీలోకి జంప్‌ చేసేస్తున్నారన్న వార్త బయటకు పొక్కింది. 'తూచ్‌, నేను టీడీపీలోకి వెళ్ళడంలేదు.. ఏదో మర్యాదపూర్వకంగా కలిశానంతే..' అంటూ ఎల్‌.రమణతో భేటీ అయిన విషయాన్ని ఒప్పుకున్నారాయన. 

కాస్త వెనక్కి వెళితే, టీడీపీలో వుంటూ.. కేసీఆర్‌ని విమర్శిస్తూ.. చాటుమాటుగా కేసీఆర్‌ని ఎర్రబెల్లి కలిసిన రోజులు గుర్తుచేసుకుందాం. అప్పట్లో రేవంత్‌రెడ్డి గుస్సా అయ్యారు.. ఎర్రబెల్లి ఖండించేశారు. మీడియాలో వచ్చిన వార్తల్నీ ఖండించి పారేశారు. 'టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళడమంటే రాజకీయ వ్యభిచారమే..' అంటూ నీతులు చెప్పేశారు. ఇంకా దారుణమైన మాటలు మాట్లాడారు. చివరికి, టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసేశారు. 

ఏమో, రేప్పొద్దున్న ఎర్రబెల్లి తిరిగి టీడీపీలోకి రీ-ఎంట్రీ ఇవ్వొచ్చేమో.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కానీ, తెలంగాణలో ఉనికి కోసం నానా పాట్లు పడుతున్న టీడీపీలోకి ఎర్రబెల్లి రీ-ఎంట్రీ ఇచ్చి ఏం సాధిస్తారట.? ఆయనకే తెలియాలి.

Readmore!

Show comments