వేషము మార్చెను.. భాషా మార్చెను

శశికళను, జయలలితకు 'నిచ్చెలి'గా చెబుతారు. అమ్మ, చిన్నమ్మ.. అని జయలలిత, శశికళ గురించి తమిళనాడులో చెప్పుకుంటుంటారు అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. ఇప్పుడు జయలలిత లేరు, శశికళ వున్నారు. అదీ జయలలిత స్థానంలో. ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలు స్వీకరించారు, అతి త్వరలో ముఖ్యమంత్రి పీఠమెక్కనున్నారు శశికళ. 

జయలలిత వెనకాల వుండడం వేరు, జయలలిత పొజిషన్‌లో వుండడం వేరు. అందుకే, శశికళ తానే జయలలిత అనే స్థాయికి తనను తాను మార్చేసుకోవాలనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో శశికళ తీరులో చాలా మార్పులొచ్చాయి. ఆమె మాట తీరు, ఆమె బాడీ లాంగ్వేజ్‌.. ఇవన్నీ మారిపోయాయి. త్వరలో, శశికళ కాస్ట్యూమ్స్‌ కూడా మారిపోనున్నాయి. అవును, ఇది నిజం. జయలలిత ప్రత్యేకత.. ఆమె చీరకట్టు. ఇప్పుడు ఆ చీరట్టులో కనిపించేందుకు శశికళ సర్వసన్నద్ధమవుతున్నారట. 

'ఏం చేసినా, అదంతా అమ్మ మీద అభిమానంతోనే..' అంటూ శశికళ పొలిటికల్‌ ఫీట్స్‌ని అన్నాడీఎంకే శ్రేణులు వెనకేసుకొస్తుండడం గమనార్హం. అయితే, జయలలితలా శశికళ మాట్లాడగలారా.? ఆమెలో ఆ వాక్చాతుర్యం వుందా.? పార్టీ శ్రేణుల్ని కంటి చూపుతో కంట్రోల్‌ చేసేంతటి శక్తి శశికళకు వుందా.? ఒకవేళ ముఖ్యమంత్రి అయితే, పరిపాలనలో జయలలితలా తనదైన ముద్ర వేయగలరా.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే. 

గెటప్‌లో ఏముంది.? సినీ పరిశ్రమ నుంచి మేకప్‌ ఆర్టిస్ట్‌ని తీసుకొస్తే.. అచ్చం జయలలితలా శశికళను మార్చేస్తారు. అది పెద్ద విషయం కానే కాదు. వేషం మార్చినంత తేలిగ్గా, భాష మార్చినంత తేలిగ్గా.. జయలలితలా డైనమిజం ప్రదర్శించడం కుదరదు. జయలలిత మీద వున్న అభిమానంతో శశికళ చర్యల్ని ఆ పార్టీ నేతలు కొందరు సమర్థిస్తుండొచ్చుగాక.. కానీ, శశికళకు ముందుంది మొసళ్ళ పండగ.

Show comments