అన్నింటికీ బాబు ఉండగా.. ఇక అసెంబ్లీ ఎందుకు?

అఖిలపక్షం.. అసెంబ్లీ సమావేశాలు.. గత రెండేళ్ల నుంచి ఏపీ లో పూర్తిగా వినిపించకుండా పోయిన పదాలివి. అన్నింటికీ నేను ఉండగా.. ఇక వేరే అఖిలపక్షం ఎందుకు? అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? అన్నట్టుగా కొనసాగుతోంది బాబుగారి తీరు. రాజ్యంగబద్ధమైన ఈ విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి తీరును చూస్తుంటే.. వ్యవస్థకే అప్రతిష్టగా మారింది.

వెనుకటి రోజుల్లో.. తను ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో.. చంద్రబాబు అనునిత్యం అఖిల పక్ష సమావేశం జరగాలని తెగ డిమాండ్ చేసేవాడు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అయితే ఏ విషయానికి అయిన బాబు మొదటి డిమాండ్ అఖిల పక్ష సమావేశమే! బాబుగారి మార్కు ఇంగ్లిష్ లో “ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి..’’ అనే డైలాగు ఆయన నుంచి ఎక్కువగా వినిపించేది.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాలకు అంతో ఇంతో ప్రాధాన్యతను ఇచ్చేది. కమ్యూనిస్టు పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ ల ను పిలిపించుకుని.. ముఖ్యమంత్రి, మంత్రులు వివిధ అంశాలపై డిస్కస్ చేసేవారు. అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్న సభలో అఖిలపక్ష సమావేశాలు కూడా వాడీవేడీగానే జరిగేవి. కొన్ని  పార్టీలు క్రియాశీల సలహాలను ఇస్తే.. మరికొన్ని ఆ సమావేశాల్లోనే ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోసేవి.

అయితే.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ విషయంలో ఎక్కువగా డిమాండ్ చేసిన బాబు ఇప్పుడు మాత్రం ‘అఖిలపక్షం’ అనే మాటెత్తితే ఒట్టు! అత్యంత కీలకమైన రాజధాని అంశం దగ్గర నుంచి సవాలక్ష అంశాలపై ఎవ్వరి అభిప్రాయాలనూ ఆయన పరిగణనలోకి తీసుకోరు. ఏ అంశం మీద అయినా చర్చ జరిగితే.. దానిలోని లోటు పాట్లపై అభిప్రాయాలు వినిపిస్తాయి. అయితే ఆ అవకాశమే ఇవ్వరు!

ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పాలంటే.. ఆ పార్టీ ఆఫీసులో కూర్చుని చెప్పుకోవాలంతే. ఎన్ని సార్లు వివిధ అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఇక అసెంబ్లీ విషయానికి వస్తే.. వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి జరిగే ఈ సమావేశాలు కేవలం నాలుగు రోజులకు మాత్రమే పరిమితం.. అనే వార్త నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే! ఆ నాలుగు రోజుల్లో కూడా తొలి రోజు ప్రసంగాలు పోనూ.. మిగిలింది మూడు రోజులు. ఒక రోజు జీఎస్టీ బిల్లును పాస్ చేయించడం పై  పని పెట్టుకున్నారు. అవి రెండూ పోగా.. రెండు రోజుల సమావేశాలట!

మరి జగన్ మీద అనుచితమైన మాటలు మాట్లాడటానికి.. అతడు అవినీతి పరుడు .. మాట్లాడే అర్హత లేని వాడు.. అని గొడవ చేయడానికి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పాతేస్తామని హెచ్చరించడానికి  అధికార పార్టీకి ఆ రెండు రోజులూ సరిపోతాయా? అని! 

అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకే పరిమితం కావడం ఏమిటి? అంటే.. స్పీకర్ గారు అదేదో అంతర్జాతీయ సదస్సుకు ఏదో విదేశం వెళ్ల నున్నారని అందుకే సమావేశాలను కుదిస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ముఖ్యమంత్రికే కాదు.. సర్కారులోని అందరికీ స్వరాష్ట్ర విషయాల  కన్నా.. విదేశీ వ్యవహారాల మీదే  ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది!

Show comments