పెప్పర్‌ స్ప్రేనా.? ఉతికి ఆరేస్తారా.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించే క్రమంలో మన్మోహన్‌ సర్కార్‌ విలక్షణ వ్యూహాల్ని అమలు చేసింది. దేశ పరువు ప్రతిష్టల్ని గంగలో కలిపేసిన వ్యూహాలవి. అందులో ఒకటి పెప్పర్‌ స్ప్రే అయితే, ఇంకోటి ఉతికి ఆరెయ్యడం. ఇవే కాదు.. ఇంకా చాలా చెత్త వ్యూహాలతో అప్పట్లో మన్మోహన్‌ సర్కార్‌ 'ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుని' గట్టెక్కించింది. 

పార్లమెంటు రణ రంగమైపోయింది. ఎంపీలు కొట్టుకున్నారు.. పెప్పర్‌ స్ప్రే కొట్టారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్‌. టీడీపీకి చెందిన ఓ ఎంపీ మీద దారుణాతి దారుణమైన దాడి జరిగింది. ఇంకో టీడీపీ ఎంపీకి హార్ట్‌ ఎటాక్‌ కూడా వచ్చింది. పార్లమెంటు తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాల్ని నిలిపివేసి.. ఇలా, ఆనాటి అరాచకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మళ్ళీ అలాంటి పరిణామాలు రేపు పార్లమెంటులో చోటుచేసుకునే అవకాశాలున్నాయా.? ఏమో, ఔననే అంటున్నారు చాలామంది.. ఆనాటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని. 

అయితే, ఈ సారి అంత తీవ్రమైన పరిస్థితులు లేవక్కడ. కానీ, 'పరువు నష్టం..' అని బీజేపీ భావిస్తే మాత్రం, కేవీపీ రామచంద్రరావు పెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్‌ విషయంలో ప్రస్తుత నరేంద్రమోడీ సర్కార్‌, అంతకన్నా దారుణంగా ప్రవర్తించే అవకాశాలు మెండుగానే వున్నాయి. ఎందుకంటే మొదట్లో ఈ వ్యవహారాన్ని లైట్‌ తీసుకున్న కాంగ్రెస్‌, బీజేపీ.. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి గనుక. 

గడచిన పదిహేనేళ్ళలో కేవలం మూడంటే మూడుసార్లు మాత్రమే ప్రైవేటు మెంబర్‌ బిల్లులు చట్టంగా మారాయి. అది కూడా, అధికారపక్షం మద్దతివ్వడం ద్వారా. అలాంటిది, అధికారంలో వున్న బీజేపీ, పూర్తిగా ప్రత్యేకహోదాని వ్యతిరేకిస్తున్న దరిమిలా, కాంగ్రెస్‌ ఎంత గింజుకున్నా బీజేపీ నుంచి 'బుల్‌డోజ్‌' వ్యవహారాన్ని మాత్రమే చూడగలం. ఆ క్రమంలో పెప్పర్‌ స్రే ఘటన పునరావృతం కావొచ్చు.. ముష్టియుద్ధాల్ని చూడాల్సి రావొచ్చు.. అంతకన్నా హీనంగానూ పరిస్థితులు మారొచ్చు.  Readmore!

చూద్దాం.. మన్మోహన్‌ సర్కార్‌ హయాంలో విభజన వ్యవహారాన్ని సాకుగా చూపి పార్లమెంటు పరువు పోగొట్టిన దరిమిలా, ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌.. ప్రత్యేక హోదా బిల్లు పేరు చెప్పి.. పార్లమెంటు స్థాయిని ఇంకెంతలా దిగజార్చేస్తుందో.!

Show comments

Related Stories :