ధోనీకి అక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది మరి!

ఇంత వరకూ ఏ బాలీవుడ్ డబ్బింగ్ బొమ్మా.. వసూలు చేయనంత స్థాయి లో వసూళ్లను సాధిస్తోంది ‘ఎమ్ఎస్ ధోనీ’. అసలు దక్షిణాదినే హిందీ డబ్బింగ్ సినిమాలను ఎవరూ అంతగా పట్టించుకోరు. ఏ ‘ప్రేమ పావురాలు’ ‘ప్రేమాలయం’ వంటి సినిమాల తర్వాత ఈ మాత్రం ఆసక్తిని జనరేట్ చేసిన హిందీ డబ్బింగ్ బొమ్మలు లేవు. ఇక తమిళనాడు సంగతి సరే సరి! తమిళ హీరోలు వెళ్లి బాలీవుడ్ లో డ్యామినేట్ చేయడమే కానీ, తమిళనాడు వరకూ వచ్చిన బాలీవుడ్ హీరోలు లేరు. అయితే ఇలాంటి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సాగుతోంది ‘ఎంఎస్ ధోనీ’.

ఇప్పటి వరకూ ఈ సినిమా దాదాపు ఏడు కోట్ల రూపాయల వసూళ్ల ను సాధించిందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు! ఇంత వరకూ చరిత్రలో  ఏ హిందీ డబ్బింగ్ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు. స్ట్రైట్ గా హిందీలో విడుదల అయ్యి కానీ, తమిళంలోకి డబ్ అయ్యి కానీ.. బాలీవుడ్ సినిమాలు గరిష్టంగా సాధించిన మొత్తం 1.5 కోట్లు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా ఆ ఫీట్ ను సాధించింది.

అయితే ‘ఎమ్ ధోనీ’ తమిళ వెర్షన్ మాత్రం తిరుగులేని స్థాయి వసూళ్లు సాధించింది. ఇదే సినిమా తెలుగులోకి డబ్ అయినా ఇక్కడ మరీ అంత సీన్ లేదు. తమిళనాడులోనే ఇలా ప్రత్యేకంగా వసూళ్లు రావడానికి కారణం.. తమిళులతో ధోనీకి ఉన్న అనుబంధం. ఏడెనిమిదేళ్లు చెన్నై ఐపీఎల్ టీమ్ కు ధోనీ ప్రాతినిధ్యం వహించాడు. ఆ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించి తన జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపాడు.

ఇండియన్ టీమ్ కన్నా.. చెన్నై సూపర్ కింగ్స్ నే ఎక్కువగా అభిమానిస్తారు తమిళులు. అదే అభిమానం ధోనీపైనా ఏర్పడింది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆ టీమ్ లేకుండా పోయినా.. పాత అనుబంధం మాత్రం చెరగలేదు. దీంతోనే ధోనీ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు!

Show comments