ఇకపై వాళ్ల జోలికెళ్లను.. ఇప్పటికి వదిలేయండి!

నిన్న మొన్నటి వరకూ.. చాలా విశాల భావాలు వ్యక్తం చేస్తూ వచ్చిన కరణ్ జొహార్ ఇప్పుడు మాట మార్చేశాడు. కళలకు,కళాకారులకు మతం.. దేశం ఉండదు… అంతా ఒకటే, పాక్ నటీనటులు ఇండియా సినిమాల్లో పని చేయడం పట్ల అభ్యంతరం ఉండనక్కర్లేదు.. కళాకారులు ఉగ్రవాదులు కాదు… అన్నట్టుగా చెబుతూ వచ్చిన ఈ దర్శక నిర్మాత ఉన్నట్టుండి.. “ఇకపై పాక్ నటీనటుల జోలికి వెళ్లను..ఇప్పటికి వదిలేయండి..’’ అని అంటున్నాడు.

 ఇతడి తాజా సినిమా “దిల్ హే ముష్కిల్’’ విషయంలో కొన్ని హిందుత్వవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో.. ఈ సినిమాను అడ్డుకుని తీరతాం.. అని ప్రకటించిన నేపథ్యంలో కరణ్ ముందు జాగ్రత్తతో కూడిన ప్రకటనలు చేస్తున్నాడు. పాక్ నటుడు నటించాడనే కారణంతో ఈ సినిమాను అడ్డుకుంటామని ఎమ్ఎన్ఎస్ వంటి సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో… కరణ్ మాట్లాడుతూ, ఇకపై తను రూపొందించే సినిమాల్లో పాక్ నటీనటులకు స్థానం కల్పించను అని ప్రకటించాడు. తన తాజా సినిమాను మాత్రం అడ్డుకోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.

మరి ఇప్పుడు కరణ్ తన విశాల భావాలకు తిలోదకాలు ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు తన సినిమా ఇంపార్టెంట్.. సినిమా విషయంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే కోట్ల నష్టం అవుతుంది. అది కళ, కళాకారులు, పాకిస్తాన్, విశాల భావాల కన్నా ముఖ్యం. అందుకే కరణ్ టోన్ మార్పు వచ్చింది!

Readmore!
Show comments