ఒకవైపు చిత్తశుద్ధి లేని శివపూజారి.. పూజలైతే గట్టిగా చేస్తాడు, దేవాలయాన్ని వారానికి ఒకసారి సందర్శిస్తారు.. అయితే అనైతికమై రాజకీయాలకు మాత్రం మద్దతు పలుకుతాడు.. అంటూ ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి నరసింహన్ మీద. కాంగ్రెస్ నేత రామచంద్రయ్య అయితే నరసింహన్ తీరును తీవ్రంగా ఖండించారు. పూజలు చేస్తే చాలదు.. అంటూ రామచంద్రయ్య నరసింహన్ ను విమర్శించారు. తెలంగాణ, ఏపీల్లో ప్రతిపక్ష పార్టీల తరపున గెలిచిన వారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడమే నరసింహన్ పై తీవ్రమైన విమర్శలకు కారణం. ఆయన తీరుపై తాజాగా ఆయనకే ఫిర్యాదు చేశాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
తన పార్టీ ఎమ్మెల్యేల చేత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దానిపై నరసింహన్ కే ఫిర్యాదు చేశాడు. మరి ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తికే.. ఆ ప్రమాణ స్వీకారంపై ఫిర్యాదు చేయాల్సి రావడం ఇక్కడ విచిత్రం. మరి ఆ సంగతంతా అలా ఉంటే.. నరసింహన్ కు ఉప రాష్ట్రపతిని ఆఫర్ చేస్తున్నారనే గాసిప్ ఒకటి షికారు చేస్తోందిప్పుడు. త్వరలోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రణబ్, అన్సారీలు పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అన్సారీ స్థానంలో నరసింహన్ ను ఉప రాష్ట్రపతిగా చేద్దామని అనుకుంటున్నారట నరేంద్రమోడీ. దీంట్లో చాలా లెక్కలే ఉన్నాయని కూడా అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ లౌక్యం, కాంగ్రెస్ కాలంలో నియమితుడై.. బీజేపీ హయాంలో కూడా కొనసాగగలుగుతున్న ఆయన చాతుర్యం.. ఆయనంటే ఏమిటో చెబుతున్నాయి. అంతేకాదట.. వెనుకటికి పోలీసాఫీసర్ గా కీలకశాఖల్లో పని చేయడం, వంటి కారణాలు కూడా నరసింహన్ పై మోడీకి ఇంప్రెషన్ పెంచాయట.. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతికి ఈయనే తగువ్యక్తి అనుకుంటున్నారట.. దీంతో నరసింహన్ వైస్ ప్రెసిడెంట్ కావడం ఖాయమే అంటున్నారు. అయితే ఇదంతా రూమర్ మాత్రమే. ప్రస్తుతం బీజేపీ తీరును చూస్తే.. నరసింహన్ కు ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చేంత అవకాశం ఉండకపోవచ్చు. ఆల్రెడీ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవుల కోసం కమలం పార్టీలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అవకాశం వచ్చి బీజేపీ సభ్యత్వం లేని వ్యక్తి వద్ద వాలుతుందంటే నమ్మడం కష్టమే!