ఓ మంచి సినిమాలో నటించడమే తప్పయితే.. ఆ మంచి సినిమా ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడమే తప్పయితే.. కళాత్మక చిత్రాల్లో నటించడమే తప్పయితే.. ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అంటోంది బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. 'ధోనీ', 'రక్తచరిత్ర', 'లెజెండ్', 'లయన్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో మాత్రం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. సంచలనాలంటే ఇక్కడ వివాదాలని అర్థం.
'హంటర్' సినిమాతోనే చాలా వివాదాలకు ఛాన్సిచ్చింది రాధికా ఆప్టే. అంతేనా, షార్ట్ ఫిలింస్ చేసినా సరే రాధికా ఆప్టే పేరు వివాదాల్లోకి ఎక్కాల్సిందే. ఇక, ఎప్పుడో నటించిన 'పర్చేద్' సినిమా అయితే ఇప్పుడామెను వివాదాల్లోకి లాగింది. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే ఈ సినిమా 18కి పైగా పురస్కారాల్ని అందుకుంది. ఇండియాలో మాత్రం కాస్త లేటుగా ఈ సినిమా విడుదలవుతోంది.. అదీ చాలా సన్నివేశాలకు సెన్సార్ కత్తెర అనంతరం.
సినిమా ఇంకా విడుదల కాకపోయినా, సినిమాలోని 'అడల్ట్ కంటెంట్' మాత్రం బయటకు వచ్చేసింది. అదెలా వచ్చింది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్నచూపుని ఎత్తి చూపేలా ఈ సినిమా వుంటుందట. అయితే, 'మెసేజ్' మాటున, సినిమాలో విచ్చలవిడి శృంగారాన్ని చూపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై రాధికా ఆప్టే స్పందిస్తూ, పై విధంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు గొట్టేసింది.
తన సినిమాల్ని అడల్ట్ సినిమాలతో పోల్చొద్దని చెబుతూనే, అలా ఎవరైనా పోల్చాలనుకున్నా తనకేమీ అభ్యంతరం లేదని రాధికా ఆప్టే స్పష్టం చేసింది.