బిగ్‌ జోక్‌: 'పని తీరు'.. అనగానేమి.!

మంత్రి నారాయణ.. 2014 ఎన్నికలకు ముందు అసలు రాజకీయాల్లోనే లేరు.. అయినా ఆయనగారికి మంత్రి పదవి దక్కింది. పైగా, తెలుగుదేశం పార్టీలో నెంబర్‌ టూ పొజిషన్‌ ఆయనదే. ప్రభుత్వంలో నారాయణ ఎంత చెబితే అంత. ఆఖరికి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి కూడా చంద్రబాబుతో యాక్సెస్‌ తగ్గిపోయింది మంత్రి నారాయణ కారణంగానే.! 

టీజీ వెంకటేష్‌.. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్‌ నేత. కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేసి, ఆ సమయంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తి పోశారు టీజీ వెంకటేష్‌. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరినా, ఆయన టీడీపీని బలోపేతం చేసేందుకు ఏం చేశారట.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.! కానీ, టీజీ వెంకటేష్‌ అనూహ్యంగా రాజ్యసభ పదవి పొందారు. 

ఇక్కడ, 'పనితీరు' అనేదానికి కొలమానం ఏమైనా వుందా.? ఒకవేళ వున్నా, దానికి అర్థం పర్థం వుందా.? తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తలు సంధిస్తున్న ప్రశ్నలివి. ఎందుకు.? అంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పార్టీ శిక్షణా తరగతుల్లో పాల్గొని, 'పని తీరు ఆధారంగానే పదవులు..' అని సెలవిచ్చారు మరి.! 

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణలో వైఫల్యాలకు నారా లోకేష్‌ బాధ్యత తీసుకోరు. ఎందుకంటే, ఆయన ఎవరో కాదు, పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు. పనితీరు ఆధారంగానే పదవులు అయితే, మంత్రి నారాయణకు పదవి వుండకూడదు.. టీజీ వెంకటేష్‌కి రాజ్యసభ ఛాన్స్‌ దక్కి వుండకూడదు.. నారా లోకేష్‌ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ వుండకూడదు. చెప్పేటందుకే నీతులు.. పాటించేందుకు మాత్రం కాదు. ఎనీ డౌట్స్‌.?

Show comments