చంద్రబాబు వ్యూహాత్మక లోపం.. అతిగా ప్రతిష్టకు పోతున్నారు!

ఒకవేళ నంద్యాల బై పోల్స్‌ను భూమా వారసులకే అప్పగించేసినట్టుగా కలరింగ్‌ ఇచ్చి ఉండుంటే పెద్దగా లొల్లి ఉండేది కాదు. ఓడినా గెలిచినా.. వారిదే బాధ్యత అన్నట్టుగా ప్రకటనలు చేస్తూ ఉండుంటే పెద్దగా పట్టించుకోనట్టుగా ఉండుంటే అదోలెక్క. ఈ ఉప ఎన్నికలతో మాకు వచ్చేదీలేదు, పోయేదీ లేదు.. అన్నట్టుగా వ్యవహరించి ఉంటే ఒకవేళ పార్టీ ఓడినా మరీ అంత చెడ్డపేరు రాదు. కానీ.. చంద్రబాబు మాత్రం నంద్యాల ఉప ఎన్నికను చాలా చాలా సీరియస్‌గా తీసుకునేశారు. ఇప్పటికే ఈ ఉపఎన్నికల్లో గెలవడం అనే అంశంపై మూడుసార్లు ఏపీ కేబినెట్‌ చర్చిచింది.

ఇక పార్టీ నేతలు అనేక మందితో దీనిపై చర్చించారు చంద్రబాబు. ఏకంగా ఆరుమంది మంత్రులకు నంద్యాల్లో పార్టీని గెలిపించే బాధ్యతను అప్పగించేశారు. వీళ్లంతా ఇప్పుడే పని మొదలుపెట్టాలని.. ఎలాగైనా నంద్యాల్లో పార్టీ నెగ్గాల్సిందే అని బాబు స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి భారీఎత్తున నిధుల విడుదలా జరుగుతోంది. కోటి రూపాయలతో ఇఫ్తార్‌ విందును ఇవ్వడం మొదలుపెడితే.. ప్రతిపాదనలో, పెండింగ్‌లో ఉన్న డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ కోసం ఇప్పటి వరకూ ఏకంగా వందకోట్ల రూపాయల నిధులను విడుదల చేశారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఒక నియోజకవర్గంలో వందకోట్ల రూపాయల నిధులతో డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ను చేపడితే.. పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలు ఎంతగా పొంగిపోవాలి? మరి ఇంతజేసినా.. నంద్యాల్లో తెలుగుదేశం గాలి వీస్తుందంటే సొంతపార్టీ వాళ్లు కూడా నమ్మడంలేదు. 

మరి ఇది వరకూ వైఎస్‌ వంటి వాళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడూ బైపోల్స్‌ వచ్చాయి. వాటిల్లో గెలవడాన్ని వాళ్లెవ్వరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. చంద్రబాబు మనస్తత్వం పూర్తి వైరుధ్యంగా కనిపిస్తోంది. తను ఎంతో చేస్తున్నాను.. ఎంతో ఖర్చుపెట్టి మిమ్మల్నందరినీ పోషిస్తున్నాను.. నాకు ఓటేయరా? అని ఓటర్లను బాబు ప్రశ్నిస్తున్నాడంటే.. ఆయన మానసిక స్థితి ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజలంతా తనకు రుణపడి ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. బయటకే అనేస్తున్నాడు కూడా. వాళ్లకు తను ఎన్నో చేశాను అని, వాళ్లంతా తనకు బాకీపడ్డారని.. ఓటు రూపంతో రుణం తీర్చుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. ఈ విషయాన్నే నంద్యాల్లో చెప్పేశాడు కూడా.

మరి మాటెత్తితే తనకు అంత అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, అంత అపరిపక్వంగా మాట్లాడతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆ మాటలకు తగ్గట్టుగానే ఉంది నంద్యాల బై పోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తీరు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిస్తే వచ్చే లాభమేంటో తెలీదు కానీ, ఓడితే మాత్రం.. వచ్చే చెడ్డ పేరు అంతాఇంతా కాదు.

అంత మంది మంత్రులు, అధికారం, స్వయంగా చంద్రబాబు వ్యూహాలు పన్నడం, సానుభూతి, భూమా ఫ్యామిలీ, మంత్రిపదవి.. ఇన్ని ఆయుధాలు ఉన్నా టీడీపీ గెలవలేకపోతే.. అంతకు మించిన అవమానం ఉండదు. ఒకవేళ ఈ నియోజకవర్గం మాది కాదు, మాకు ప్రతిష్ట కాదు.. అన్నట్టుగా వ్యవహరించి ఉంటే, గెలిచినా.. ఓడినా టీడీపీకి అంతగా పోయేదేమీ ఉండేది కాదు. కానీ బాబు వ్యూహాత్మక తప్పిదమైన తీరుతో ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటారో చూడాలి.

Show comments