నాగ్ చైతన్యే హాట్ చాయిస్

సినిమా మార్కెట్ మరీ అద్భుతంగా లేకపోయినా, చకచకా సినిమాలు ఏవీ రాకపోయినా, నాగ్ చైతన్య అంటే చాలు నిర్మాతలు, డైరక్టర్లు కూడా రెడీ అంటున్నారు. అదేం మ్యాజిక్ నో? ప్రస్తుతం నాగ్ చైతన్య రెండు సినిమాలు పూర్తి చేసాడు. ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో స్వంత బ్యానర్ లో నిన్నేపెళ్లాడుతా అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్షన్ లో సాయి కొర్రపాటికి ఓ సినిమా కమిట్ అయ్యాడు. 

తొలిసారి అమ్మ వైపు తాత బ్యానర్ లో కృష్ణ అనే కొత్త దర్శకుడి డైరక్షన్ లో సినిమా చేయడానికి రెడీఅవుతున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయిక. ఇవి కాక యువి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయాలన్నది ఎప్పటి నుంచో డిస్కషన్ లో వుంది. ఇవన్నీ అయ్యేసరికి ఏదైనా మంచి సబ్జెక్ట్ తో అన్నపూర్ణ సంస్థ రెడీగా వుంటుంది. 

దర్శకులతో, నిర్మాతలతో డౌన్ టు ఎర్త్ వైఖరితో వుండడమే నాగ్ చైతన్య అసలు సిసలు రహస్యమని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అతనితో పరిచయం వున్న ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అస్సలు ఇగో, స్టార్ ని, ఇలాంటివి వుండవని, తనకు ఎవరితో చేయాలని వుందో వారి దగ్గరకు నేరుగా తానే వెళ్లిపోతాడని, అస్సలు ఓ స్టార్ సన్ ని అని కానీ, స్టార్ ని అని కానీ అనుకోడని అంటారు. 

సమంతతో పెళ్లి వ్యవహారంలో కూడా చైతూ చాలా హుందాగా వ్యవహరించాడు. సమంత ఎలా ట్వీట్లు చేసినా, ఎలా మాట్లాడినా, చైతూ మాత్రం, తండ్రి కూడా మీడియా ముందు బయటపడేవరకు, తాను మాత్రం స్పందించలేదు. బహుశా ఈ తరహా ప్రవర్తనే చైతూను బిజీగా వుండేలా చేస్తోందేమో?

Show comments