ఏపీ బంద్: కర్ణాటకను ఆదర్శంగా తీసుకోవాలి!

బంద్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? ఇలాంటి బంద్ లన్నీ నష్టాలను చేసేవే తప్ప లాభం ఏముంది? అనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నిజమే..  ఒక రోజు బంద్ చేయడం వల్ల కేంద్రం ఇవ్వకూడదని ఫిక్సయిన ప్రత్యేక హోదా రాకపోవచ్చు. ఇదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన బేసిక్ థియరీ ఏమిటంటే… ఏదైనా దెబ్బ తగిలితే “అమ్మా..’’ అంటాం… అలా అంటే నొప్పి ఉండదని కాదు. కాబట్టి… నేడు ఏపీ స్తంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థం చేసుకోవాలి.

బంద్ కు జగన్ పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి… బంద్ లు అనేవి అనౌచిత్యం అని థియరీలు కేవలం అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్లే కాదు.. వాళ్లను అభిమానించే వాళ్లు కూడా వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దాదాపుగా ఇప్పటికే ప్రకటనలు కూడా సిద్ధం చేసుకుని ఉండవచ్చు. సాయంత్రం వాటిని వారు చదవి వినిపింవచ్చు. యనమల వంటి వాళ్లు ఇది వరకూ కూడా ప్రత్యేక హోదా కోసం బంద్ జరిగితే… అది ఫెయిల్ అని ప్రకటించారు. ఈ రోజు కూడా సాయంత్రానికి అలాంటి ప్రకటనలు ఎన్నో వస్తాయి అందులో సందేహం లేదు కూడా.

బంద్ బందే.. ఆ ప్రకటనలు ప్రకటనలే. ఏపీ ప్రజలు వైకాపా ఆధ్వర్యంలోని బంద్ కు సహకరించలేదు… ప్రజలకు బంద్ లు అస్సలు ఇష్టం లేదు. ప్యాకేజీతో ప్రజలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు… అనే సన్నాయి నొక్కులూ చాలా మందే నొక్కవచ్చు. ఎంత గట్టిగా బంద్ జరిగినా సాయంత్రానికి ఈ రకమైన ప్రచారంతో అధికార పార్టీ హడావుడి చేయగలదు. ఆ శక్తియుక్తులున్నాయి. 

మరి రాష్ట్ర విభజన ఆగుతుందని సమైక్యాంధ్ర అంటూ అప్పట్లో బంద్ లు జరిగాయా? ఒక నిరసనను తెలపడానికి తోలు మంద సర్కారులకు పరిస్థితి అర్థం చేసేలా చేయడానికి బాబుగారు చెప్పే జపాన్ తరహా విధానాలు పనికిరావు. అది ఆయనకూ తెలుసు. అందుకే ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తెలుగుదేశం బంద్ లు నిరసనలు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టేవి.

అలా పగలగొట్టమని కాదు కానీ.. నిన్న కర్ణాటకలో బంద్ జరిగింది. ఎందుకో తెలుసా? సుప్రీం కోర్టు ఆదేశాలకు నిరసనగా! కావేరీ జల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుతో తమకు అన్యాయం జరిగిందని కన్నడీగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నిర్ణయం కాకపోయినా, కావేరీలో తమిళనాడు తన్నుకుపోతున్న వాటాతో తమకు అన్యాయం జరుగుతుందని అంటూ కన్నడీగులు కోర్టు తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు.

కావేరీ జల వివాదం ఏమీ కొత్తా కాదు, ఇలాంటి పంచాయతీనూ కొత్త కాదు. ప్రతియేటా జరిగే తతంగమే ఇది. కానీ.. కన్నడీగులు నిరసనకు నిర్వచనం ఇచ్చారు. పార్టీలకు అతీతంగా, అధికారం, ప్రతిపక్షం తేడా లేకుండా.. మూకుమ్మడిగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. కనీసం టిఫిన్ సెంటర్లు కూడా తెరవనీయకుండా.. అత్యంత కఠినంగా బంద్ నిర్వహించారు.

మరి కోర్టు తీర్పు విషయంలోనే అలాంటి పని జరిగింది…అదే రాజకీయ నిర్ణయం అయ్యుంటే వారి స్వాభిమానం ఎలాంటి పరిణామాలను సృష్టించేదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి తమిళుల నుంచినో, కన్నడీగుల నుంచినో ఇలాంటి స్వాభిమానం గురించి , ఆత్మగౌరవం గురించి ఆంధ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. బంద్ విజయవంతం అయ్యిందంటే ఎక్కడ వైకాపాకు క్రెడిట్ వచ్చేస్తుందో అని బంద్ ఫెయిల్ అని, బంద్ లతో అంతా నష్టమే అని మాట్లాడే మనకు అవి అంత సులభంగా అర్థం కావులే!

Show comments