డ్రగ్స్, అడ్డగోలు సంపాదన: వీళ్ళా మాట్లాడేది.?

తెలుగు సినీ పరిశ్రమపై 'డ్రగ్స్‌ మేఘాలు' కమ్ముకున్న వేళ, 'వృద్ధ నారీ డాష్‌ డాష్‌..' అన్న చందాన కొందరు సినీ ప్రముఖులు మీడియా ముందుకొచ్చి, చెప్తున్న 'సుద్దులు' అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొన్నవారూ, ఇప్పటికీ డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారూ వుంటున్నారు. 

రాత్రికి రాత్రి వచ్చేసే స్టార్‌డమ్‌ కారణంగా వచ్చే డబ్బుని ఎలా ఖర్చు చేయాలో తెలియక యువ నటీనటులు డ్రగ్స్‌ని ఆశ్రయిస్తున్నారనీ, తాము పడ్డ కష్టంతో పోల్చితే ఇప్పుడు యువతరం పడుతున్నది అసలు కష్టమే కాదన్నది ఆ సోకాల్డ్‌ 'వృద్ధ డాష్‌ డాష్‌'లు చెబుతున్న మాట.

చాలామంది యువ నటులు రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ సంపాదిస్తున్న మాట వాస్తవం. వారి రెమ్యునరేషన్‌ లక్షల నుంచి కోట్లకు పడగలెత్తుతున్నమాట కూడా వాస్తవం. కానీ, డ్రగ్స్‌ని ఎంతమంది ఆశ్రయిస్తున్నారు.? మహా అయితే వేళ్ళ మీద లెక్కబెట్టగల స్థాయిలోనే వుండొచ్చు. ఈ మాట చెబుతున్నది కూడా సదరు సినీ ప్రముఖులేనండోయ్‌. 

డబ్బు సంపాదన తేలికైపోయిందంటూ సుద్దులు చెబుతున్న సదరు సినీ ప్రముఖులు, ఎలా డబ్బు సంపాదిస్తున్నారట.? ఓ రాజకీయ ప్రముఖుడికి బినామీ అన్పించుకుని, తెలుగు సినీ పరిశ్రమలో అపర కుబేరుడిలా వెలుగుతున్నాడొక 'సీనియర్‌'. ఇంకొకాయన, థియేటర్లను తన కబంధహస్తాల్లో బంధించేసి, మొత్తం సినీ రంగాన్ని శాసించేస్తున్నాడాయె. ఆయనగారి కుటుంబ సభ్యుల్లోనూ ఒకరిపై డ్రగ్స్‌ ఆరోపణలు వస్తే, చిత్రంగా వాటిని 'కామప్‌' చేసేశారు. ఈ అంశాల చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్స్‌ జరుగుతున్న 'రచ్చ' అంతా ఇంతా కాదు.! 

'కంచె చేను మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.?' అన్న చందాన, 'కొందరు' సీనియర్లు చూపిన బాటలోనే యువతరం నడుస్తోందన్నది ఇంకో వాదన. గతంలోనూ డ్రగ్స్‌ విషయమై టాలీవుడ్‌పై ఆరోపణలు వచ్చాయి. అప్పుడెవరూ ఈ ఆరోపణల్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. రెడ్‌ హ్యాండెడ్‌గా డ్రగ్స్‌తో దొరికినవారినీ, ఇతరత్రా అసాంఘీక కార్యకలాపాల్లో బుక్‌ అయినవారినీ, తిరిగి సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చి, వారికి 'మేకతోలు' కప్పేయడంతోనే ఈ దుస్థితి దాపురిస్తోందన్నది నిర్వివాదాంశం. 

'ప్రభుత్వమెలాగూ కఠిన చర్యలు తీసుకుంటుంది, మేం కూడా అలాంటి అక్రమార్కులుపై ఇండస్ట్రీ పరంగా ఉక్కుపాదం మోపుతాం..' అంటూ మీడియా ముందు హడావిడి చేస్తున్నవాళ్ళకి తెలియదా, టాలీవుడ్‌లో ఎవరెవరికి డ్రగ్స్‌తో లింకులున్నాయో.!

Show comments