ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించాక పరిణామాలు వేగవంతం అవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటకపై భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే దృష్టి సారించింది. అవసరమైతే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిపేంచేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంతీసుకుంటే ఇక దాన్ని కాదనేవారుండరు. గతంలో శశికళ గ్రూప్‌ను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే రెండాకుల చిహ్నం ఇవ్వకుండా స్తంభింపజేసింది. అంటే ఎన్నికల కమిషన్ కూడా కేంద్రం అడుగుజాడల్లో నడుస్తున్నదన్నమాట. ఇక సుప్రీంకోర్టు గురించి కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
శశికళపై కేసును వెంటనే తెరిచి ఆమెకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేందుకు ఆగమేఘాలపై ముందుకు వచ్చిందని, ఇందులో కేంద్రం హస్తం ఉన్నదని ప్రచారం జరిగింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిచిన వెంటనే సుప్రీం కోర్టు అయోధ్యమందిరం విషయంలో మధ్యేమార్గాన్ని సూచించింది. కోర్టు వెలుపల ఇరు పార్టీలు పరిష్కారం కుదుర్చుకోవాలని, అవసరమైతే తాము కూడా న్యాయ సహాయం చేస్తామని చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక అయోధ్య విషయంలో ముస్లిం మతసంస్థలు వెనుకంజ వేసే అవకాశాలు కనపడడం లేదు. నయానో భయానో వారికి నచ్చ జెప్పి ఆయోధ్యలో స్తలాలను పంపిణీ చేసి రామమందిరం కట్టాలనే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అదే జరిగితే ఉత్తరప్రదేశ్‌లో 2019 నాటికి పెద్దఎత్తున హిందూ అనుకూల ప్రభంజనం వీయడం దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఏర్పడడం ఖాయమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
నిజానికి యోగీ ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునేముందు దాదాపు ఆరురోజుల పాటు బీజేపీలో అంతర్మధనం జరిగింది. ఈ అంతర్మధనంలో మోడీ, అమిత్‌షాతో పాటు అగ్రస్థాయి ఆరెస్సెస్ నేతలు పాల్గొన్నారు. రాజ్‌నాథ్ సింగ్, మౌర్య తదితరుల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ అంతిమంగా మెజారిటీ నేతలు యోగీ ఆదిత్యనాథ్ వైపే మొగ్గు చూపారు. ఇందుకు ప్రధాన కారణం 2019 నాటికి దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం వీచి స్వంతంగా 400సీట్లు గెలుచుకునేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పర్చాలని వారు భావించడమే. భారతదేశాన్ని అప్రకటిత హిందూదేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు భావించారు. యూపీ హస్తగతం కావడంతో వారి ఫార్ములాకు తిరుగు లేకుండా పోయింది. నిజానికి మోడీకి, యోగీ ఆదిత్యనాథ్‌కు పెద్దగా తేడాలేదు. గుజరాత్‌లో అల్లర్ల సమ యంలో హిందూ అనుకూల వాతావరణం సృష్టించి మోడీ అధికారాన్ని శాశ్వతం చేసుకున్నారు. అదే ఫార్మూలా ఉత్తరప్రదేశ్‌లో ఉపయోగించాలని ఆయన భావించారు.
దేశవ్యాప్తంగా హిందూ ఓట్లను సంఘటితం చేయడంలో తానొక్కడినే సరిపోడని, ఇందుకు యోగీ ఆదిత్యనాథ్ బాగా ఉపయోగిస్తారని నరేంద్ర మోడీ భావించినట్లు తెలుస్తోంది. నిజానికి 2014లోనే ఆదిత్యనాథ్ మోడీకి అనుకూలంగా సభలు నిర్వహించి మొత్తం హిందూ ఓట్లను సంఘటితం చేశారు. తాను స్వయంగా అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఘనత ఆదిత్యనాథ్‌కున్నది. ఆదిత్యనాథ్‌కు జనాదరణ రావడా నికి ప్రధాన కారణం ముస్లింలకు వ్యతిరేకంగా తీవ్రస్థా యిలో విమర్శలు చేయడం. హిందూ యువవాహిని అనే సంస్థను ఏర్పర్చి ఆయన కరడుగట్టిన హిందూ వాదిగా పేరొందారు. షారూక్ ఖాన్, మదర్ థెరిస్సా లాటిం వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. లవ్ జిహాద్, ఘర్ వాపసీ ఉద్యమాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ముస్లింలలో చేరిన అనేకమంది హిందువులను ఆయన తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చారు. ఆయన దేశవ్యాప్తంగా హిందూమతాన్ని వ్యాప్తి చేయగలడని, ఆయన, మోడీ కలిసి దేశమంతా తిరిగితే జనం పెద్ద ఎత్తున బ్రహ్మ రథం పడతారని బిజెపి నేతలు భావిస్తున్నారు.
ఆదిత్యనాథ్ అభివృద్ది ఎజెండాగా పనిచేస్తారని నరేం ద్రమోడీ చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన మరునాడే ఆదిత్యనాథ్ పనితీరు అర్థమైంది. యూపీ అంతటా గోవులను వధించే శాలలపై దాడులు జరిగాయి. వాటిని పెద్దఎత్తున మూసివేయించారు. ఆదిత్యనాథ్ గోవుల పరిరక్షణకోసం ఇంతకాలం ఉద్యమాలు నిర్వహించారు ఇప్పుడు స్వయంగా ఆయనే ముఖ్యమంత్రి కావడంలో అడ్డులేకుండా పోయింది. నరేంద్రమోడీ ఎజెండాలో యూపీకి సంబంధించి ఉన్న ప్రధాన అంశాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో గంగానది ప్రక్షాళనతో పాటు గంగా ఘాట్‌లను తీర్చిదిద్ది గంగానదిలో రవాణాకు ఏర్పాట్లు చేయడం. వారణాసిని అంతర్జాతీయ యాత్రాస్థలంగా తీర్చిదిద్దడం. అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం కొన్ని వేలకోట్లు వారణాసికి కేటాయించినప్పటికీ రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉండడం వల్ల అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారణాసి రూపురేఖలు మార్చేందుకు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా కృషి చేస్తారనడంలో సందేహంలేదు. అంతేకాక గంగానది ప్రక్షాళనకు కేంద్రం చేపట్టిన నమామి గంగా ప్రాజెక్టు కూడా విజయవంతం అయ్యే అవకాశాలున్నా యి. కేంద్రంలో జలవనరుల మంత్రిగా సాధ్వీ ఉమాభారతి, రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ఉండగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగినట్లే. ఈ ఇద్దరూ యోగులే కారణం గమనార్హం.
ఇవికాక బీజేపీ ఎజెండాలో ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయడం. యూపీ ఎన్నికలకు ఎన్నో రోజులకు ముందుగానే బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడడం ప్రారంభించింది. భారతదేశంలో ఇస్లామిక్ పౌరస్మృతి షరియత్ అమలును రద్దు చేసేందుకు నరేంద్రమోడీ వేనుకాడే అవకాశాలు లేవు. ఇప్పటికే ఈ అంశంపై చర్చ జరిగి హిందూ ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీ వైపు మొగ్గు చూపారు. నిజానికి ముస్లిం మహిళలను తలాఖ్ నుంచి కాపాడడం మాత్రమే బీజేపీ ఉద్దేశం కాదు. దేశంలో ముస్లింల జనాభా తగ్గించడం కూడా బీజేపీ వ్యూహరచనలో భాగమని చెప్పకతప్పదు.
మొదటిరోజు నుంచే గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడం ప్రారంభించిన యోగీఆదిత్యనాథ్ జనాలను ఆకర్షించడం ప్రారంబించారు.ప్రభుత్వ కార్యాలయాలను ఆయన సందర్శించి పనితీరులో మార్పురావాలని, స్వచ్చభారత్‌ను అమలు చేయాలని ఆదేశించారు. మోడీలాగా ఆయన బ్రహ్మచారి. అవినీతి చేయాల్సిన అవసరం ఆయనకులేదు. అందువల్ల ఆయన అవినీతిని ప్రోత్సహించే అవకాశంలేదు. ఈ రీత్యా యూపీలో పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇది యూపీ ప్రజలకు ఊరట కలిగిస్తుంది. ప్రతిపక్షాల అవినీతి పాలనను ఇప్పటికే చవి చూసిన ప్రజలు యోగీ ఆదిత్యనాథ్‌ను స్వాగతిస్తారనడంలో అతిశయోక్తి లేదు.
నరేంద్రమోడీ, యోగీ ఆదిత్యనాథ్ భారతదేశంలో మార్పుకు చిహ్నాలు. ఎన్నో ఏళ్లుగా అలవాటుపడ్డ అవి నీతి రాజకీయాలకు భిన్నంగా ప్రజలు వీరికి పట్టం కట్టారు. ఈ ఇద్దరూ ప్రజల్లో హిందూత్వం పట్ల ఒక రకమైన అభిమానాన్ని కల్పించారు. భారతదేశంలో మెజారిటీ ఉన్న హిందువులు తమకు పూర్తిగా మద్దతునిచ్చే వాతావరణాన్ని వారు కల్పిస్తున్నారు. అదే జరిగితే దేశంలో కాంగ్రెస్, వామపక్షాలు క్రమంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. మోడీ ఎజెండాలో కాంగ్రెస్ విముక్త భారత్ మాత్రమేకాక ప్రాంతీయ పార్టీ విముక్త భారత్‌ను కూడా ఏర్పాటు చేయడం. యూపీ ప్రయోగం దేశమంతా విజయం సాధిస్తే వారనుకున్న ఎజెండాను అమలు చేయగలుగుతారు.
ప్రజలు హిందూత్వను అభిమానిస్తే ఎవరేమి చేయగలరు.. అంతేకాక ఇప్పుడు స్వదేశీ ప్రజలను కాపాడాలన్న వాదం అంతర్జాతీయంగా కూడా ఆదరణ పొందింది. అమెరి కాలో ట్రంప్‌ను గెలిపించడం, ఇండియాలో మోడీ, యోగీ ఆదిత్యనాథ్‌లకు పట్టంకట్టడం ఇందుకు నిదర్శం. హిందూత్వంను అభిమానించడం మతతత్వమని, ఇతర మైనారిటీలను ప్రోత్సహించడం లౌకిక వాదమని ఇంతకాలం తప్పుడు ప్రచారం చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు పశ్చాత్తాపపడే పరిస్థితి ఏర్పడింది. వచ్చే కొద్దిరోజులు మరింత ఆసక్తిగా ఉంటాయన్న విషయంలో సందేహంలేదు. దేశవ్యాప్తంగా తమకు అనుకూల వాతావరణం సృష్టించే క్రమంలో మోడీ, యోగీ ఏమి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.