లాస్ట్‌ సీఎం...మిమ్మల్ని గుర్తు చేసుకున్నాం...!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రి ఎవరో అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని, ఎట్టి పరిస్థితిలోనూ విడిపోనివ్వనని ప్రతిజ్ఞ చేసిన నాయకుడు ఎవరో తెలుసు. కాని రాష్ట్రం విడిపోయాక ఆయన ఎవరో అతి కష్టం మీద గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఆయన తనకు తానై కల్పించుకున్నారు. మౌనంగా ఉండిపోయారు. అజ్ఞాతంలో కాలం గడుపుతున్నారు. ఈ 'అండర్‌గ్రౌండ్‌ లీడర్‌' మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి, అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన రికార్డు కిరణ్‌ది. 

అలాగే మంత్రి పదవి నిర్వహించకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయిన (కాంగ్రెసులో) వ్యక్తి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. ఈ రోజు ఆయన్ని ప్రజలకు గుర్తు చేసింది ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌. ఎందుకు? ఈరోజు ఆయన పుట్టిన రోజు. 56 ఏళ్లు నిండాయి. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల పుట్టిన రోజుల గురించి మీడియా ఏమైనా ప్రస్తావిస్తుందేమోగాని మాజీలను పట్టించుకునే అవకాశం లేదు. అందులోనూ పార్టీలవారీగా చీలిపోయిన మీడియా మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రాధాన్యం ఇవ్వదు. కాని ఒక న్యూస్‌ ఛానెల్‌ కిరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఆయన్నో గొప్ప ప్రజా నాయకుడిగా కీర్తించింది. ఆ ఛానెల్‌ పేరు 'ఐ న్యూస్‌'. అది కిరణ్‌ సొంత ఛానెల్‌ అనే ప్రచారముంది.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం, సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఐ న్యూస్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాదాపుగా మూతపడే సమయంలో కిరణ్‌ దాన్ని కొనుగోలు చేశారని (నేరుగా కాకపోయినా ఆయన సహకారంతో అనుచరులు)  మీడియా మిత్రులు చెబుతుంటారు. ఉద్యమాల సమయంలో కిరణ్‌ ఒంటరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉంటూ సమైక్యం కోసం గట్టిగా నిలబడిన ఆయనకు మీడియా మద్దతు అవసరమైంది. అందులోనూ కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కూడా. 

ఏది ఎలా ఉన్నా తనకంటూ సొంత మీడియా ఉండాలనుకొని ఐ న్యూస్‌ ఛానెల్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేశారు. కిరణ్‌ జన్మదినాన ప్రత్యేక కథనం ప్రసారం చేయడానికి ఇదీ నేపథ్యం. గత ఏడాది (2015) కూడా ఇదే రోజున ఆయన 'ఘన చరిత్ర'ను కీర్తిస్తూ ఈ ఛానెల్‌ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. అప్పటి కథనం సారాంశం...కిరణ్‌ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఆయన అధికారంలో ఉండగా ఆయన సమర్థతను అపార్థం చేసుకున్నారు. కాని ఆయన సమర్థత ఏమిటో రాష్ట్రం విడిపోయాక ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. విభజన వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయని ఆయన చెప్పారో అవన్నీ ఏపీలో కనబడుతున్నాయి. 

ఆయన సమర్ధతకు, పాలనకు తగిన గుర్తింపు రాకపోవడానికి కారణం కిరణ్‌ మీడియాను మేనేజ్‌ చేయకపోవడమే. ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఆయన అవసరం ఇప్పుడు ఎంతగానో ఉందని ప్రజలు భావిస్తున్నారు...ఇలా సాగింది గత ఏడాది కథనం. ఈ రోజు ప్రసారమైన కథనంలోనూ కిరణ్‌ పాలనపై ప్రశంసలు కురిపించింది ఛానెల్‌. అయితే ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్‌ను ప్రస్తావించలేదు. అప్పట్లో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలను ఆయన ఎలా డీల్‌ చేశారో, సంక్షోభాన్ని ఎలా తట్టుకున్నారో, శాంతిభద్రతలను ఎలా పరిరక్షించారో తాజా కథనం వివరించింది. 

అలాగే ఆయన యువతకు, ఇతర వర్గాలవారికీ ఎంతో మేలు చేశారని చెబుతూ రాజీవ్‌ యువ కిరణాలు, బంగారు తల్లి, ఇందిరమ్మ ఇళ్లు...తదితర పథకాల గురించి ఛానెల్‌ వివరించింది. కిరణ్‌ను గొప్ప ప్రజా నాయకుడిగా ప్రశంసించింది. చివరగా కిరణ్‌ పాలన నుంచి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చాలా నేర్చుకోవాలని ముక్తాయించింది. కిరణ్‌ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు కొంతకాలం కిందట ఓ పత్రిక రాసింది.  ఇది విశ్వసనీయ సమాచారమని కూడా ఆ పత్రిక తెలిపింది. కిరణ్‌తో కాంగ్రెసు ప్రముఖులు చర్చలు జరిపారు. 

పార్టీలో సముచిత స్థానం, ప్రాధాన్యం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనూ రాణించే అవకాశం ఉంటుందని చెప్పారట...!    కిరణ్‌కుమార్‌ రీఎంట్రీపై ఇప్పటివరకు అనేక కథనాలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి.  అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొంతకాలానికే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కిరణ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. ఆయన మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు.  

Show comments