పార్టీ పెట్టిన తర్వాత, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ, దానికి తగినంత సమయం, స్ట్రాటజీలు లేకపోవడంతో పవన్‌కళ్యాణ్, జనసేన పార్టీని ఓ రాజకీయ వేదికగా స్తబ్దుగా వుంచేశారు. ఏళ్ళు గడుస్తున్నా, జనసేన పార్టీ నుంచి ఇప్పటిదాకా నిఖార్సయిన పొలిటికల్ 'యాక్టివిటీ' లేనే లేదు. ఇదిగో, అదిగో.. అంటూ రెండున్నరేళ్ళు గడిపేసిన పవన్‌కళ్యాణ్, సోషల్ మీడియాలో పార్టీని యాక్టివ్‌గా మార్చిన తర్వాత, ఆయనపై ఒత్తిడి మరింత అధికమవుతోంది.
రాజకీయాల్లో కొందరుంటారు.. వారెవరో కాదు, తాము వున్న పార్టీలో పొజిషన్ అటూ ఇటూగా వుందని అనుకునేవాళ్ళే. అలాంటివాళ్ళు నిత్యం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తూనే వుంటారు. సరిగ్గా, అలాంటివాళ్ళే ఇప్పుడు జనసేనలో ఓ కర్చీఫ్ వేసి చూద్దాం.. అనే ధోరణితో వున్నారు. నిజానికి ఇదిప్పుడు కొత్తగా మొదలైందేమీ కాదు, అలాంటివాళ్ళకి పవన్ యాక్సెస్ ఇవ్వడంలేదంతే.!
మొన్నటికి మొన్న పవన్‌కళ్యాణ్ ప్రత్యేక హోదాపై మాట్లాడినప్పుడూ, అంతకు ముందు అమరావతిలో పర్యటించినప్పుడూ జగన్‌తో యాక్సెస్ కోసం పలువురు కిందిస్థాయి నేతలు ప్రయత్నించి చితికిలపడ్డారు. మళ్ళీ ఇదిగో ఇప్పుడు పవన్‌తో 'మీటింగ్' కోసం ఆయా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అయితే, ప్రస్తుతానికి తన కొత్త సినిమా 'కాటమరాయుడు' సినిమా పనుల్లో బిజీగా వున్న పవన్, రాజకీయాలకు కొన్నాళ్ళు విరామం ప్రకటించినట్లు సన్నిహితుల ద్వారా ఆయా నేతలకు సంకేతాలు పంపిస్తున్నారు.
సినిమాల్లో బిజీగా వుంటే, సోషల్ మీడియాలో జనసేన హడావిడి ఏంటట.? అన్న ప్రశ్నా ఉత్పన్నం కాక తప్పదు. కానీ, జనసేన పార్టీ కేవలం పవన్‌కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కడి మీదనే ఆధారపడి వుంది. ఆయన తప్ప, ఇంకెవరూ ఆ పార్టీకి సంబంధించి ఏ విషయాలూ మాట్లాడలేని పరిస్థితి. సోషల్ మీడియాలో జనసేన కార్యక్రమాల కోసమైనా పవన్ ఓ టీమ్‌ని ప్రకటించి వుంటే బావుండేదేమో.!
అధికార ప్రతినిథుల్లేరు, పవన్‌కళ్యాణ్ తప్ప ఇంకో నాయకుడు లేడు.. ఓ రాజకీయ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఇంకెన్నాళ్ళు.? 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం.. అని పవన్ చెప్పిన మాటల్ని సీరియస్‌గా తీసుకుంటోన్న నేతలేమో, పవన్‌కళ్యాణ్‌తో భేటీల కోసం విఫలయత్నాలే చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జనసేన సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వరకూ ఓకే. కానీ, పార్టీకంటూ క్యాడర్, నాయకులు వుండాలి కదా. ఆ క్యాడర్ అయినా, నాయకులు అయినా, పార్టీ సిద్ధాంతాల్ని తెలుసుకోవడమెలా.?
ఈ ప్రెజర్‌ని పవన్ కూడా ఫీలవుతున్నారట. కానీ, ఆయనా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజారాజ్యం అనుభవాలతో, పవన్ జనసేన విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారట. అదీ అసలు సమస్య. ఈ కన్‌ఫ్యూజన్‌లో పవన్‌కళ్యాణ్, 2019 ఎన్నికల్నీ సైడేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.