గల్లా కోరికను బాబు తీరుస్తాడా?

ఎమ్మెల్సీ పదవి.. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి బాగా ఆశలు పెట్టుకున్నారు దీని మీద. కాంగ్రెస్ పార్టీలో పదేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన గల్లా అరుణ ఆఖరి క్షణంలో పార్టీ ఫిరాయించేశారు. వైఎస్ , కిరణ్ లకు బాగా సన్నిహితంగా మెలిగి కూడా.. బాబు వద్ద ఏకంగా ఒక ఎంపీ టికెట్, మరో ఎమ్మెల్యే టికెట్ ను సంపాదించుకోవడం గల్లా ఫ్యామిలీకే సాధ్యం అయ్యింది.

ఎంపీగా గెలిచేసుకున్నారు కానీ, ఎమ్మెల్యేగా మాత్రం అరుణ కుమారి గెలవలేకపోయారు. సొంత సామాజికవర్గం దట్టంగా ఉన్న నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో గత రెండున్నరేళ్లుగా ఆమె ఎమ్మెల్సీ పదవి మీద ఆశలుపెట్టుకున్నారు. తన సీనియారిటీకి ఆ మాత్రం మర్యాద దక్కాలని ఆమె ఆశిస్తున్నారు.

అయితే బాబు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల, నామినేషన్ల హడావుడి మొదలైంది. మరి ఇప్పుడైనా ఆమెకు అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. చిత్తూరు జిల్లా నుంచి దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న వారు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. వారితో పోలిస్తే టీడీపీలో గల్లా అరుణ చాలా జూనియర్. కానీ.. ఆమె ఆర్థికంగా అత్యంత స్థితిమంతురాలు! ఆమెకు సీటిస్తే.. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎన్నికల ఖర్చు భారాన్ని మోపవచ్చని, దీంతో బాబు ఆమెకు ఈ సారి సీటు ఇవ్వడం ఖాయమే అని టీడీపీ నేతలే ఆఫ్ ద రికార్డుగా అంటున్నారు!

Show comments