లడ్డూ కావాలా నాయనా...

కాకినాడ వేదికగా సీమాంధ్రుల ఆత్మగౌరవ సభను జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నిర్వహించారు. షరామామూలుగానే ఈ సభలోనూ పవన్‌కళ్యాణ్‌ ఒక్కరే 'స్పీకర్‌'. దాదాపు గంటపాటు పవన్‌కళ్యాణ్‌ ప్రసంగం సాగింది. బీజేపీని విమర్శించారు, టీడీపీని విమర్శించారు, పనిలో పనిగా వైఎస్సార్సీపీపైనా సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తిపోశారు. తనపై రాజకీయ విమర్శలు చేస్తున్నవారికి కౌంటర్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్యాకేజీపై మండిపడ్డారు. ఇంకేవేవో చెప్పారు. కానీ, పవన్‌ నుంచి అభిమానులు, రాష్ట్ర ప్రజానీకం చాలా ఆశించారు.. ఆ ఆశించినదేదీ పవన్‌ ప్రసంగంలో కన్పించలేదు. 

ఇంతకీ, కాకినాడ సభలో పవన్‌ ఏమేం మాట్లాడారంటే... 

ప్రత్యేక హోదా అడిగితే, రెండున్నరేళ్ళ తర్వాత రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు.. తీసుకుందామా.? విసిరి వారి మొహాన కొడదామా.? అంటూ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు పవన్‌కళ్యాణ్‌. 

రాజకీయాలంలో గడ్డం గీసుకోవడమంత తేలిక కాదన్న టీడీపీ ఎంపీ (రాజ్యసభ) టీజీ వెంకటేష్‌ విమర్శలపై స్పందించిన పవన్‌, గడ్డం గీసుకున్నంత తేలిగ్గా అప్పటి మీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్‌ని నిలువునా చీల్చేసింది కదా.! అంటూ కౌంటర్‌ వేశారు. 

'ఆమరణ నిరాహార దీక్ష చేయమంటారా.? రాజకీయ డ్రామా మొదలు పెట్టమంటారా.? రంగంలోకి దిగితే చావో రేవో తేల్చుకుంటాను తప్ప, డ్రామాలు నాకు చెల్లవు..' 

అంబేద్కర్‌ విగ్రహాలకు దండలు వేయడం కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి.. 

మహనీయులు నడయాడిన పార్లమెంటులో మన తెలుగు ఎంపీ కొణకళ్ళ నారాయణ మరికొందర్ని చావుదెబ్బలు కొట్టారు.. ఇదేనా ప్రజాస్వామ్యం.? 

అవంతి శ్రీనివాస్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసి, అందరికీ స్ఫూర్తిగా నిలిస్తే, తిరిగి ఎంపీగా గెలిపించే బాధ్యత తనదంటూ పవన్‌కళ్యాణ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 

ఓట్లు అడుక్కునే వేళ అర్థమయ్యే భాషలో చెబుతారు.. గద్దెనెక్కిన తర్వాత అర్థం కాని భాషలో మాట్లాడతారంటూ కేంద్రంపై దుమ్మెత్తిపోశారు జనసేనాధిపతి. 

తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నేతల్ని ఉద్దేశించి చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అంటోంటే బాధేసింది.. నేనొక్కడ్నే వారికి సమాధానమిచ్చాను.. దురదృష్టవశాత్తూ సీమాంధ్ర నేతలెవరికీ పౌరుషం లేదు సమాధానం చెప్పడానికి.. సీమాంధ్ర ఆత్మగౌరవం అక్కడే దెబ్బతింది. 

తెలంగాణ కష్టాలు నాకు తెలుసు, అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని కోరుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సంతోషం. కానీ, ఆంధ్రప్రదేశ్‌ నాశనమైపోయింది. ఇది కాంగ్రెస్‌ చేసిన పాపం. ఏపీ, తెలంగాణ పోలీసులు కొట్టుకున్నారంటే విభజన ఎంత రాక్షసంగా జరిగిందో అర్థమవుతుంది. 

అధికారం కోసమే అయితే సమైక్యాంధ్ర ఉద్యమం నడిపేవాడిని. ఎంపీ అవ్వాలనుకుంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి నన్ను కాదనేవారెవరు? దేశం నేతలారా సీమాంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టొద్దు. అధికారంలోకి వస్తే అన్నీ హ్యాపీడేస్‌ అని చెప్పి, కష్టాల్లోకి ఆంధ్రప్రదేశ్‌ని నెట్టేశారు. కేంద్రం వద్ద తలొంచుకు నిల్చునే దౌర్భాగ్యమెందుకు.? తలెత్తి నిలదీయండి.! 

ఇవి ముచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా చాలా డైలాగులే పేలాయి పవన్‌కళ్యాణ్‌ నుంచి కాకినాడ బహిరంగ సభ వేదికగా. కానీ, ఏం లాభం.? పవన్‌ క్వశ్చనింగ్‌లో క్లారిటీ మిస్సయ్యింది. దీనికన్నా తిరుపతి బహిరంగ సభ ఇంకాస్త క్లారిటీతోనే వుందని చెప్పాలి. కాకినాడ వేదికగా ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్‌ పిలుపునిస్తారనుకుంటే, ప్రజలెవరూ రోడ్డెక్కి ఆందోళన చేయవద్దని పవన్‌ పిలుపునివ్వడం గమనార్హం.

Show comments