పవన్‌, శివబాలాజీ.. ఓ కత్తి కథ

కొన్నాళ్ళ క్రితం పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'అన్నవరం' సినిమాలో పవన్‌కళ్యాణ్‌కి బావగా నటించాడు శివబాలాజీ. ఇప్పుడు తాజాగా 'కాటమరాయుడు' సినిమాలో పవన్‌కళ్యాణ్‌కి తమ్ముడిగా నటిస్తున్నాడు. 'అన్నవరం' సినిమాలో పవన్‌ కత్తులతో సావాసం చేస్తుంటాడు. ఓ సీన్‌లో శివబాలాజీని కత్తితో బెదిరిస్తాడు కూడా. అదే శివబాలాజీ ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌కి 'కత్తి'ని బహుమతిగా ఇచ్చాడు. అదే మరి విశేషమంటే. 

'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ సమయంలో పవన్‌కళ్యాణ్‌ తనను ఎంతో బాగా చూసుకున్నారనీ, ఇంతటి ఆప్యాయత ఏ హీరో దగ్గరా తనకు దక్కలేదని చాలా సందర్భాల్లో శివబాలాజీ చెప్పుకొచ్చాడు. అందుకే, శివబాలాజీ - పవన్‌కళ్యాణ్‌ మీద అమితమైన అభిమానాన్ని పెంచేసుకున్నాడట. అలా పెంచుకున్న అభిమానాన్ని ఓ ఖడ్గం రూపంలో మలచి, దాన్ని పవన్‌కళ్యాణ్‌కి 'భక్తితో' సమర్పించుకున్నాడు. 

ఆషామాషీగా కాదు, ప్రత్యేకంగా ఖడ్గాన్ని తయారు చేయించి, దాని మీద జనసేన అనే పేరు చెక్కించి, పవన్‌కళ్యాణ్‌కి శివబాలాజీ ఆ ఖడ్గాన్ని అందించాడు. అది చూశాక పవన్‌కళ్యాణ్‌ కూడా ఆశ్చర్యపోయాడట. చాలా బాగుందని, శివబాలాజీని మెచ్చుకున్నాడట. అన్నట్టు 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ రోజు శివబాలాజీ పుట్టినరోజు సంగతి తెలుసుకుని కేక్‌ తెప్పించి కట్‌ చేయించాడు పవన్‌కళ్యాణ్‌. ఆ సందర్భాన్ని తలచుకుని శివబాలాజీ ఇప్పటికీ మురిసిపోతుంటాడు.

Show comments