'10 వేల కోట్లు - చంద్రబాబు బినామీ'

ఇటీవల నల్లధనం వెల్లడి కోసం కేంద్రం ఇచ్చిన ఆఫర్‌కి సంబంధించి నల్ల కుబేరులు స్వచ్ఛందంగా తమ నల్లధనాన్ని వెల్లడించిన విషయం విదితమే. అలా వచ్చిన మొత్తాన్ని 68 వేల కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అయితే, అలా వచ్చిన నల్లధనానికి సంబంధించి ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తం వసూలయ్యిందనే విషయాన్ని గోప్యంగా వుంచారు. ఈ 'గోప్యత' కారణంగానే నల్ల కుబేరులు, తమ నల్లధనాన్ని ప్రకటించిన మాట వాస్తవం. 

అయితే, అలా నల్లధనం వెలికి తీత వ్యవహారంలో, హైద్రాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి 10 వేల కోట్ల రూపాయలతో హల్‌చల్‌ చేశాడన్న ప్రచారం జోరుగా సాగుతోందిప్పుడు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ, ఆ పది వేల కోట్లు జగన్‌వేనని తేల్చేయడం వివాదాస్పదమయ్యింది. అత్యంత గోప్యతతో కూడిన నల్లధనం వెలికి తీత వ్యవహారానికి సంబంధించి, మేటర్‌ టీడీపీకి లీక్‌ అయ్యిందా.? లేదంటే, చీకట్లో రాయి విసురుతోందా.? తమపై దుష్ప్రచారానికి ఈ సందర్భాన్ని టీడీపీ వాడుకుంటోందా.? అనే ప్రశ్నల్ని సంధిస్తూ, కేంద్రానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. 

ఈ లేఖ విషయాన్ని వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియా ముందుంచారు. లేఖలో జగన్‌, '10 వేల కోట్లు హైద్రాబాద్‌కి చెందిన వ్యక్తి వెల్లడించారని చంద్రబాబు చెబుతున్నారు.. అంటే, ఆ వ్యక్తి ఎవరో చంద్రబాబుకి తెలిసే వుండాలి.. ఆ వ్యక్తి కూడా చంద్రబాబుకి బినామీ అయి వుండాలని మేం అనుమానిస్తున్నాం. లేదంటే అంత ఖచ్చితంగా ఆయన ఆ మొత్తం గురించి ఎలా చెప్పగలుగుతారు?' అని ప్రశ్నించడం గమనార్హం. 

గడచిన రెండేళ్ళ కాలంలో లక్ష కోట్లకు పైనే ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి జరిగిన విషయాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి, కేంద్రానికి తెలియజేశామంటూ లేఖలో వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు ప్రధాని నరేంద్రమోడీకి.  Readmore!

టిట్‌ ఫర్‌ టాట్‌.. కుక్క కాటుకి చెప్పుదెబ్బ.. అంటే ఇదే మరి.! నల్లధనం వెల్లడికి సంబంధించి అన్ని విషయాలూ అత్యంత గోప్యంగా వుంచుతామని కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలకి సంబంధించి ఎలాంటి దుష్ప్రచారం జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు. ఇప్పుడేమో యధేచ్ఛగా టీడీపీ, నల్లధనానికి సంబంధించి గాసిప్స్‌ని ప్రచారంలోకి తెచ్చింది. వైఎస్సార్సీపీ డిమాండ్‌ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్డట్టే. కేంద్రం పూర్తిగా కాకపోయినా, తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే వ్యక్తి 10 వేల కోట్లు నల్లదనం వెల్లడించాడా? లేదా? అన్న వివరాలు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Show comments